మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ పనులు ప్రారంభించండి.. కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి

మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌  పనులు ప్రారంభించండి.. కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి
  • సివిల్‌‌‌‌ ఏవియేషన్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి
  • మూసీ ప్రాజెక్టుకు 100 ఎక‌‌‌‌రాలు బ‌‌‌‌ద‌‌‌‌లాయించండి
  • గాంధీ స‌‌‌‌రోవ‌‌‌‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌‌‌‌న కార్యక్రమానికి రండి
  • ర‌‌‌‌క్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌కు సీఎం రిక్వెస్ట్ 
  • కేంద్రం నిధులతో కృష్ణా–వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి
  • కేంద్ర  రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌కు వినతి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌కు స‌మీపంలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంత‌ర్జాతీయ ప్రమాణాల‌తో నిర్మించాల‌ని సెంట్రల్‌ సివిల్‌ ఏవియేషన్‌ మినిస్టర్‌‌ కె.రామ్మోహ‌న్ నాయుడును సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ పూర్తయినందున వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని రిక్వెస్ట్‌ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి గురువారం  కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, రాజ్‌నాథ్‌ సింగ్, అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోషీని కలిసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు విజ్ఞప్తులు అందజేశారు. పార్లమెంట్‌లోని చాంబర్‌‌లో రామ్మోహన్ నాయుడును సీఎం కలిశారు. ఆయన వెంట ఎంపీలు మ‌ల్లు ర‌వి, సురేశ్ షెట్కార్‌, గ‌డ్డం వంశీకృష్ణ, ర‌ఘురాంరెడ్డి,  క‌డియం కావ్య, అనిల్ కుమార్ యాద‌వ్‌ తదితరులున్నారు. దాదాపు అరగంటకుపైగా భేటీ సాగింది.  మామునూరు విమానాశ్రయంలో కార్గో సేవ‌ల‌తోపాటు మెయింటెనెన్స్‌, ఓవ‌ర్ హాల్ రిపేర్ (ఎంవోఆర్‌) స‌దుపాయాలు ఉండేలా చూడాల‌న్నారు. జౌళి, ఇత‌ర ప‌రిశ్రమ‌ల‌తో వ‌రంగ‌ల్ న‌గ‌రం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నదని, వ‌రంగ‌ల్‌కు ద‌గ్గర‌లోని మేడారంలో రెండేండ్లకోసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద  స‌మ్మక్క–సార‌క్క గిరిజన జాత‌ర  జ‌రుగుతుంద‌ని గుర్తు చేశారు. ఈ ఎయిర్‌‌పోర్ట్ వ‌రంగ‌ల్‌తోపాటు ఉమ్మడి ఖ‌మ్మం, న‌ల్గొండ, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌కు కేంద్రంగా ఉంటుంద‌ని వివరించారు. అలాగే, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్‌కు సంబంధించి అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు. ఆ ఎయిర్‌‌పోర్ట్ ఏర్పాటుకు అద‌నంగా అవ‌స‌ర‌మైన 249.82 ఎక‌రాలు అంద‌జేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మామునూరు విమానాశ్రయం ప‌నుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌కు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల‌ను అక్కడ‌కు పంపిస్తాన‌ని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. 

కేంద్ర నిధుల‌తో  రైలు మార్గం నిర్మించండి..

కేంద్ర రైల్వే శాఖ మంత్రి  అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన చాంబర్‌‌లో సీఎం రేవంత్‌ కలిశారు. కృష్ణా–వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధుల‌తో చేప‌ట్టాల‌ని రిక్వెస్ట్‌ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేక‌ర‌ణ వ్యయం మొత్తాన్ని తామే భ‌రిస్తామ‌ని మరోసారి గుర్తు చేశారు. కృష్ణా–వికారాబాద్ రైలు మార్గంలోని టేక‌ల్‌కోడ్‌లో లైమ్ స్టోన్ నిక్షేపాల‌ను గుర్తించామ‌ని, సిమెంట్‌,  జౌళి ప‌రిశ్రమ‌ల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయ‌త్నాల్లో ఉన్నామని తెలిపారు. అలాగే, తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు క‌ర్నాట‌కలోని ప‌లు సిమెంట్ ప‌రిశ్రమ‌ల‌కు స‌మీపంలో కృష్ణా ప్రాంతం ఉన్నదన్నారు. కొడంగ‌ల్‌, టేక‌ల్‌కోడ్‌, దౌల్తాబాద్‌ను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వివ‌రించారు. 

శంషాబాద్‌నుంచి హైస్పీడ్‌ రైళ్ల మార్గాలను ప్రారంభించాలి 

తెలంగాణ కు కేటాయించిన 3 హైస్పీడ్ రైళ్ల మార్గాలను ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ ఉన్న శంషాబాద్ నుంచే ప్రారంభించాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. హైద‌రాబాద్‌–చెన్నై (778 కి.మీ.), హైద‌రాబాద్‌–బెంగ‌ళూరు (586 కి.మీ.), హైద‌రాబాద్‌–పుణె (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స‌మీపంలో 500 ఎక‌రాల స్థలం కేటాయిస్తామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌–చెన్నై హైస్పీడ్ కారిడార్ అమ‌రావతి మీదుగా వెళ్తుందని, అక్కడి నుంచి బంద‌రు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాల‌ని అభ్యర్థించారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బంద‌రు పోర్టుకు స‌ర‌కు ర‌వాణా వేగ‌వంతం అవుతుంద‌ని తెలియజేశారు. హైద‌రాబాద్‌–బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌-–పుణె హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొద‌లు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుంద‌ని వివ‌రించారు. ఈ 3 కారిడార్లకు భూ సేక‌ర‌ణ వెంట‌నే చేప‌ట్టి ప‌నులు ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. ఈ విజ్ఞప్తులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. 

అదనపు ధాన్యాన్ని తీసుకోండి..

వానాకాలం పంట‌కు (2025-–26 సీజ‌న్‌) సంబంధించి తాము అద‌నంగా  సేక‌రించిన 18 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  సాయంత్రం ఆయ‌న నివాసంలో ప్రహ్లాద్‌ జోషితో  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. వానాకాలం పంట‌కు సంబంధించి 53.73 ల‌క్షల ట‌న్నుల‌కు (ఎల్ఎంటీ) అనుమ‌తించార‌ని తెలిపారు. కానీ భారీగా పంట ఉత్పత్తి కావ‌డంతో అద‌నంగా 18 ఎల్ఎంటీలు తాము సేక‌రించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూక‌తో ఎఫ్ సీఐ సేక‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు. 2024–25 యాసంగి పంట‌కు సంబంధించి 5 శాతం నూక‌తో అద‌నంగా 10 ల‌క్షల ట‌న్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు పర్మిషన్‌ ఇవ్వాలని  కోరారు. 2024–25 వానాకాలం పంట‌కు సంబంధించి క‌స్టమ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్రవ‌రి 28వ తేదీ వ‌ర‌కు గడువు నిర్దేశించార‌ని,  దానిని మ‌రో 2 నెల‌లు పాటు పొడిగించాల‌ని విన్నవించారు. ఎఫ్‌సీఐకి 2014–15 వానా కాలంలో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణ‌కు బ‌కాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. అప్పటి అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భ‌రించింద‌ని గుర్తుచేశారు. అప్పటిలో సేక‌ర‌ణ‌కు తాము రుణం తీసుకున్నామ‌ని, దానికి వ‌డ్డీ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగింద‌ని తెలియజేశారు. ప్రధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న కింద 2021  మే నుంచి 2022 మార్చి వ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేసిన అద‌న‌పు బియ్యం, 2022 ఏప్రిల్ నెల‌లో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని రిక్వెస్ట్‌ చేశారు.

100 ఎకరాల భూములు బదలాయించండి..

 కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో  సౌత్ బ్లాక్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టుకు రక్షణ శాఖకు చెందిన 100   ఎక‌రాల భూమి బ‌ద‌లాయించాలని కోరారు. ఈసా, మూసీ న‌దుల సంగ‌మ స్థలిలో ప్రపంచ‌స్థాయి విద్యా సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ కేంద్రంగా నిర్మించ‌నున్న గాంధీ సరోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. సుస్థిర ప‌ట్టణాభివృద్ధి ల‌క్ష్యాల‌తో ప‌ర్యావ‌ర‌ణహితంగా, స్వచ్ఛమైన నీటితో న‌ది ప్రవ‌హించేలా మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టును చేప‌డుతున్నట్టు వివరించారు.  ఈసా, మూసీ న‌దుల సంగ‌మ స్థలిలో 1948లో జాతిపిత మ‌హాత్మా గాంధీ చితాభ‌స్మాన్ని నిమ‌జ్జనం చేసిన బాపూఘాట్ వ‌ద్ద గాంధీ  స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌డుతున్నట్లు వివరించారు.