- డీజేఎఫ్‌టీ ప్రతినిధులకు సీఎం సీపీఆర్వో మల్సూర్ హామీ
హైదరాబాద్, వెలుగు: డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన వారికి అన్యాయం జరగనివ్వబోమని సీఎం సీపీఆర్వో మల్సూర్ స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించన మేరకు గతంలో కంటే ఎక్కువగానే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం సెక్రటేరియెట్‌లో డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) రాష్ట్ర నాయకులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్రెడిటేషన్ల జారీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళాన్ని సంఘం నేతలు సీపీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు.
డెస్క్ జర్నలిస్టులందరికీ కార్డులు ఇవ్వాలని కోరారు. జిల్లాల వారీగా పనిచేస్తున్న సబ్ ఎడిటర్ల సంఖ్య, గతంలో వారికి ఇచ్చిన కార్డుల వివరాలు, ఎడిషన్ సెంటర్లు, జిల్లా డెస్కుల సమాచారాన్ని ఈ సందర్భంగా వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మల్సూర్.. కార్డుల సంఖ్యను తగ్గించవద్దని అధికారులకు మంత్రి పొంగులేటి ఇప్పటికే ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎన్ని అక్రెడిటేషన్లు ఇచ్చారన్న జాబితాను తెప్పించి పరిశీలిస్తామని చెప్పారు. సీపీఆర్వోను కలిసిన వారిలో డీజేఎఫ్‌టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్, నాయకులు దొడ్డి శేఖర్, కిరణ్ కుమార్ఉన్నారు.
