తెలంగాణ రైజింగ్ సమిట్‌‌‌‌‌‌‌‌కు ప్రధాని మోదీకి ఆహ్వానం

తెలంగాణ రైజింగ్ సమిట్‌‌‌‌‌‌‌‌కు ప్రధాని మోదీకి ఆహ్వానం
  • తెలంగాణ రైజింగ్ సమిట్‌‌‌‌‌‌‌‌కు ప్రధాని మోదీకి ఆహ్వానం
  •     కేంద్రమంత్రులనూ పిలవండి: సీఎం రేవంత్ రెడ్డి
  •     ఏర్పాట్లలో లోటుపాట్లు ఉండొద్దని అధికారులకు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులను ఆహ్వానించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమిట్‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యే అతిథులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో సమిట్ ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. భారీగా పెట్టుబడులు సాధించే దిశగా సమిట్ ప్రణాళిక ఉండాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. 

ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ‘‘సమిట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే కార్యక్రమాల వారీగా ఒక్కో ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా నియమించి బాధ్యతలు అప్పగించాలి. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, సంక్షేమం, ఇండస్ట్రీ, హెల్త్ తదితర ప్రభుత్వ విభాగాల పనితీరును ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలి. సమిట్ సందర్భంగా నిర్వహించే డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను పెంచేలా ఉండాలి. సదస్సుకు సంబంధించిన అన్ని రకాల డిజైన్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి” అని ఆదేశించారు. సమిట్‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యే దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల జాబితాను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. కాగా, ఇప్పటికే సుమారు 2,600 మందికి ఆహ్వానాలు పంపామని సీఎంకు అధికారులు తెలిపారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.