యాక్చురియల్ రిపోర్ట్ ఆధారంగా సింగరేణి పెన్షన్ సవరణ.. ఎంపీ వంశీకృష్ణ లేఖకు స్పందించిన కేంద్రం

యాక్చురియల్ రిపోర్ట్ ఆధారంగా సింగరేణి పెన్షన్ సవరణ.. ఎంపీ వంశీకృష్ణ లేఖకు స్పందించిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుపై ముందడుగు పడింది. పెన్షన్ల విషయంలో యాక్చురీ (సంస్థ డేటాను విశ్లేషించే బీమా నష్టాలు, ప్రీమియంను లెక్కించే వ్యక్తి)ని నియమించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్ణయించింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంపుదల, యాక్చురియల్ రీఅసెస్మెంట్ కోసం జనవరి 6న కేంద్ర బొగ్గు గనుల శాఖకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖ రాశారు. ఈ లేఖపై తాజాగా బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ రూపిందర్ బ్రార్ రిప్లే ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 22న కోల్ మైన్స్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషణ్ (సీఎపీఎఫ్ఓ) ట్రస్టీల భేటీ జరిగిందని లేఖలో వెల్లడించారు. పెన్షన్ నిధి మూల్యాంకనంతో పాటు యాక్చురీని నియమించాలని ఈ మీటింగ్‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ యాక్చురీ పెన్షన్ పెంపు, ఇతర అంశాలను పరిశీలిస్తుందన్నారు. ఫైనల్‌‌‌‌గా ఈ యాక్చురీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పెన్షన్ సవరణ ఉంటుందని స్పష్టం చేశారు. 

పెన్షన్ పెరిగే వరకునా పోరాటం ఆగదు: ఎంపీ వంశీకృష్ణ

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని శక్తి వంచన లేకుండా పోరాడుతున్నట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో తన పోరాటం ఆగదన్నారు. పెన్షన్ల పెంపుపై గతేడాది పార్లమెంట్‌‌‌‌లో పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. అలాగే, పెన్షన్ పెంపుపై కేంద్ర బొగ్గు గనుల శాఖకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రం తాజాగా యాక్చురీని నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాక్చురీ రిపోర్ట్ ఆధారంగా పెన్షన్ పెరగనుందని చెప్పారు. ‘‘మరోసారి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు మాట ఇస్తున్నాను. మీ పెన్షన్ పెరిగే వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఈ విషయంలో మీకు మరోసారి భరోసా ఇస్తున్నా’’అని ఎంపీ వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

మంచిర్యాల, పెద్దపల్లిలో అదనపు పత్తి కొనుగోలు సెంటర్లు ..

అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) ప్రమాణాలు, కార్యాచరణ అవసరాల ఆధారంగా పత్తి కొనుగోలు కోసం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అదనపు సెంటర్లను ఏర్పాటు చేస్తామని  కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వెల్లడించింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సరిపడా పత్తి కొనుగోలు కేంద్రాలు లేక పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను మంగళవారం లోక్ సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇబ్బందులు లేకుండా అమ్మకాలు, న్యాయమైన ధర రైతులకు దక్కేలా అదనపు సెంటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందా? అని ప్రశ్నించారు. లేకపోతే అందుకు గల కారణాలు చెప్పాలని కోరారు. 

ఈ ప్రశ్నలకు కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో మూడు పత్తి కొనుగోలు సెంటర్లను ప్రారంభించినట్టు తెలిపారు. పత్తి సాగులో కనీసం 3 వేల హెక్టార్లు, క్రియాత్మక ఏపీఎంసీ లభ్యత, కనీసం ఒక జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ వంటి అంశాలను అంచనా వేసిన తర్వాత ఈ కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు. -గత సీజన్‌‌‌‌తో పోలిస్తే ఈసారి తెలంగాణలో సీసీఐ కేంద్రాలను 110 నుంచి 122కు పెంచామన్నారు. మంచిర్యాల (లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి), పెద్దపల్లి (పెద్దపల్లి, సుల్తానాబాద్, కమాన్‌‌‌‌పూర్) జిల్లాల్లో మూడేసి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మంచిర్యాలలో రూ.463 కోట్లు, పెద్దపల్లిలో రూ.97 కోట్ల విలువైన పత్తిని సేకరించినట్టు మంత్రి తన సమాధానంలో పొందుపరిచారు.