మాది ట్రిపుల్ ఇంజన్ సర్కారు..విపక్షాలకు 3 సీట్లు వస్తే గొప్ప

 మాది ట్రిపుల్ ఇంజన్ సర్కారు..విపక్షాలకు 3 సీట్లు వస్తే గొప్ప

మహారాష్ట్ర సర్కారు ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారని..ఇప్పటి వరకు ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు..అజిత్ పవార్ చేరికతో ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారిందని చెప్పారు. 

స్వాగతం..సుస్వాగతం..

మహారాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్, ఆయన వర్గం నేతలకు ఏక్ నాథ్ షిండే స్వాగతం పలికారు. మహారాష్ట్ర బలోపేతానికి ఈ చేరిక దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకే తామంతా కలిసినట్లు తెలిపారు. గత లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలకు నాలుగైదే సీట్లు వచ్చాయని..ఈ సారి అవికూడా రావడం కష్టమని ఎద్దేవా చేశారు. 

ఎన్సీపీ చేరిక..డిప్యూటీ సీఎంగా ప్రమాణం

మహారాష్ట్రలో మొదట ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ.. శివసేనలోని ఏక్‌నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎన్సీపీలోని శరద్ పవార్ ను, ఆయన వర్గ ఎమ్మెల్యేలను కూడా ప్రభుత్వంతో కలిపేసుకుంది. జులై 2వ తేదీన ఎన్సీపీలోని తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరుతున్నట్లు అజిత్ పవార్ ప్రకటించారు. ఆ తర్వాత రాజ్ భవన్ లో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అలాగే తన వర్గంలోని 9 మంది  ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.