‘ప్రజావేదిక‘ కోసం జగన్, చంద్రబాబు వ్యూహాలు

‘ప్రజావేదిక‘ కోసం జగన్, చంద్రబాబు వ్యూహాలు

విప‌క్షం ఒక‌టి త‌లిస్తే.. అధికార ప‌క్షం మ‌రొక‌టి త‌ల‌చింది… త‌న కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరితే, అటు తిరిగి.. ఇటుతిరిగి అస‌లు నివాసానికి ఎస‌రు వ‌చ్చేలా త‌యారైంది. ఏపీలో అధికార, విప‌క్షాల మ‌ధ్య చోటుచేసుకున్న ఈ వాతావ‌రణం స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక విష‌యంలో అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ మ‌ధ్య జ‌రిగే ఈ ప‌రిణామాలు రోజుకోమ‌లుపు తిరుగుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు అమ‌రావ‌తిలో అడుగుపెట్ట‌గానే ఓ ప్రైవేటు భ‌వ‌నాన్ని త‌న నివాసంగా మార్చుకున్నారు. అందుకోసం భారీగానే ఖ‌ర్చుచేశారు. అక్క‌డే అధికారిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కోసం అంటూ మ‌రో వేదిక‌ను నిర్మించారు. అదే ప్రజావేదిక…. ప్ర‌స్తుతం ఈ ప్ర‌జావేదికను తన నివాసంగా ఇవ్వమని మాజీ సీఎం హోదాలో చంద్ర‌బాబు నూత‌న సీఎం జగన్ కి రెక్వెస్ట్ చేస్తూ లేఖ రాశారు. స‌ర్కారు అలా కేటాయిస్తే త‌న నివాసం మార్చే అవ‌స‌రం కూడా లేదు. కానీ చంద్రబాబు తలచింది.. ఒక‌టి .. అక్క‌డ జ‌రిగింది మ‌రొక‌టి.

చంద్ర‌బాబు నాయుడు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జావేదిక త‌న అధికార కార్య‌క్ర‌మాల కోసం కేటాయించాల‌ని లేఖ రాసిన స‌మ‌యంలేనే వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో త‌ల‌శిల ర‌ఘురాం… ప్ర‌జావేదిక‌ను త‌మ పార్టీకి కేటాయించాల‌ని సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం కు లేఖ రాసారు. బాబు అలా లెటర్ రాసారో లేదో ఇలా వైసీపీ వాళ్ళు ఉండవల్లి ప్రజావేదిక భవనం అడగడం వెనక పెద్ద ఎత్తుగడ ఉంది. ప్రజావేదిక ఎటూ అధికార పార్టీకే సీఎస్ ఇస్తారు.

ప్ర‌జావేదిక వైసీపీకి కేటాయిస్తే అక్కడికి జగన్ సీఎం హోదాలో వస్తారు. మాజీ సీఎం చంద్ర‌బాబు నివాసం మొత్తం ట్రాఫిక్ నిబంధనల పరిధిలోకి వస్తుంది. ఇక టీడీపీ పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌డం క‌ష్టం. సో బాబుకు పొమ్మనకుండా పొగ పెట్టిన‌ట్లు ఉంది ప‌రిస్థితి. అంత‌టితో ఊరుకోలేదు …ప్రజావేదికతో పాటు బాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమని వైసీపీ తన విన్నపంలో స్పష్టంగా పేర్కొంది. దాంతో అది ఎపుడు కూల్చేసినా తాము ప్రజావేదికను ఖాళీ చేస్తామని చెప్పింది. సో అక్రమ కట్టడం కూల్చేస్తామని హింట్ ఇచ్చింది. దీన్ని బాగా అర్ధం చేసుకున్న చంద్రబాబు ఇపుడు ఉండవల్లి నివాసాన్ని ఖాళీ చేస్తార‌ని స‌మాచారం.

వ్యూహ చ‌తురుడైన చంద్ర‌బాబు ఒక ఎత్తు వేస్తే జగన్ దానికి పైఎత్తు వేశారు. ఇపుడు బాబుకు అమరావతిలో ఇల్లు లేదు. విజయసాయిరెడ్డి అన్నట్లుగా సొంత ఇల్లు లేకుండా ఇన్నాళ్ళు పాలించారా అన్న మాట వినిపిస్తోంది. ఇకపై అద్దె ఇళ్లు తీసుకుంటారా?.. ఏమో …?. టీడీపీ అధినేత మాత్ర‌మే చెప్పాలి