ప్రధాని మోడీతో సమావేశమైన సీఎం జగన్

ప్రధాని మోడీతో సమావేశమైన సీఎం జగన్

ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం జగన్ బిజీగా గడుపుతున్నారు. సౌత్ బ్లాక్‌ లో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో జగన్ బృందం 40 నిముషాలపాటు సమావేశమైంది. సీఎంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు జగన్. ఏపీ విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్‌ ప్రధానిని కారారు.

ఏపీ ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం వాటర్‌ గ్రిడ్‌ అమలు చేయాలని నిర్ణయించామని, ఇందుకు తగిన నిధులు మంజూరు చేయాలని జగన్ ప్రధానికి చెప్పినట్లు తెలుస్తోంది. సామాజిక, ఆర్థిక కుల గణనలో పొరపాట్లు జరిగాయని PM దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. BC, SC, ST, మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని, కేంద్రం నుంచి గృహాల మంజూరు సంఖ్య తగ్గిపోతోందని, ఈ క్రమంలో మళ్లీ గణన చేయడం ద్వారా గృహాల మంజూరులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని మోడీని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే ఇప్పించడంతోపాటు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని కోరారు సీఎం జగన్.