
- ప్రభుత్వమే బిల్లును చెల్లిస్తుంది.. విద్యుత్ ఆదా అవుతుంది
- శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది: ఏపీ సీఎం జగన్
- మోటార్లకు మీటర్లతో లాభాలు వివరిస్తూ రైతులకు లేఖలు రాయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఏపీ రైతులకు లేఖలు రాయాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యుత్ రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో గురువారం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘శ్రీకాకుళంలో పైలెట్‌ప్రాజెక్ట్ ఎలా సక్సెస్ అయిందో రాష్ట్ర రైతులకు వివరించాలి. అక్కడి రైతులకు కలిగిన ప్రయోజనాలను తెలియజేయాలి. 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ శ్రీకాకుళంలో ఆదా అయిన విషయాన్ని చెప్పాలి” అని స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్ల కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని, నాణ్యంగా విద్యుత్ సరఫరా ఉంటుందని, ఈ విషయాలన్నీ రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ధర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు పాడైన వెంటనే రిపేర్ చేయాలని కూడా ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపును గతంలో పైలెట్ ప్రాజెక్టుగా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పైలెట్ ప్రాజెక్టులో విద్యుత్ ఆదా అయిందని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో ఏపీ అంతటా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.