గత ప్రభుత్వంలో ఎంత దోచుకున్నారో చూపిద్దాం

గత ప్రభుత్వంలో ఎంత దోచుకున్నారో చూపిద్దాం

ప్రజాధనం కాపాడాలన్న ఉద్దేశంతోనే టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరుపుతోందని, ఇందులో రాజకీయ కక్ష లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.  అవినీతికి పాల్పడిన ఎవ్వరినీ వదలొద్దని సబ్ కమిటీకి సూచించారు. టీడీపీ పాలనలో జరిగిన కేటాయింపులు, అవినీతిపై విచారణ కోసం నియమించిన కేబినేట్​సబ్​కమిటీతో ఆదివారం ఆయన  సమావేశమయ్యారు. “‘గత పాలనలో ప్రైవేటు సంస్థలు కూడా అవినీతి జరిగిందని చెప్పే పరిస్థితి ఉంది. టీడీపీ సర్కారు అక్రమాలపై ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయి. సబ్ కమిటీ మరిన్ని ఆధారాలు సేకరించాలి. గత ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందు ఉంచడం, ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చూడటమే లక్ష్యం. 45 రోజుల్లోగా సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. అన్ని శాఖల్లోనూ విచారణ జరగాలి. ముఖ్యంగా నీటిపారుదల, సీఆర్డీఏ భూముల కేటాయింపులు, జిల్లాలవారీగా గత ఐదేళ్లలో జరిగిన కేటాయింపులు, నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్ల ఎంపిక, టెండర్​ విధానంపై దృష్టి పెట్టాలి. విచారణ కోసం ఏ విభాగాన్నైనా ఉపయోగించుకోండి. అవసరమైతే అప్పట్లో ఉన్న అధికారులను కూడా విచారించండి” అని అన్నారు. 15 రోజులకోసారి సబ్ కమిటీ సమావేశంలో పాల్గొంటానని చెప్పారు.

నీళ్ల ప్యాకెట్లలోనూ దోపిడీ: మంత్రి బుగ్గన

టీడీపీ హయాంలో నీళ్ల ప్యాకెట్ల సరఫరా నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు అన్ని రంగాల్లోనూ ప్రజాధనం దోపిడీ జరిగిందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. “దోమల డేటా సేకరణ, ఎలుకలు పట్టడం వంటి కార్యక్రమాలకు కోట్లు ఖర్చు చేశారన్నారు. “ప్రాజెక్టులు, సింగిల్​టెండర్​ విధానం, అర్బన్​ హౌసింగ్​ స్కీం, రాజధాని భూముల కేటాయింపుల్లో అవినీతి ఎక్కువగా జరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన గృహాల్లో చదరపు గజానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన దాని కన్నా రూ. 300 అధికంగా ఖర్చు చేశారు. ఇసుక ఉచితంగానే లభిస్తున్నా ఇంత అధిక మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది” అని ప్రశ్నించారు. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను సీఎం సబ్​ కమిటీకి అప్పగించారని చెప్పారు.  ప్రతి కాంట్రాక్టును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.  ప్రజాధనాన్ని రికవరీ చేసే అంశాన్ని కూడా రిపోర్ట్ లో పొందుపరుస్తామని చెప్పారు.