నీళ్ల లెక్కలు నాకే చెప్తరా.? ప్రాజెక్టులపై నాకు పూర్తి అవగాహన ఉంది

నీళ్ల లెక్కలు నాకే చెప్తరా.? ప్రాజెక్టులపై నాకు పూర్తి అవగాహన ఉంది
  • పోతిరెడ్డిపాడుపై ఇప్పుడేం మాట్లాడదల్చుకోలే..
  • రాయలసీమకు నీళ్లు పోవాలని అన్న.. ఇప్పుడు కూడా అంటున్న
  • ‌ గోదావరి నీళ్లు సముద్రంలోకి పోతున్నయి.. తీస్క పొమ్మన్న
  • ఏపీతో కలిసే ఉన్నం.. ఇంక కలిసే ఉంటం
  • మంచిగ చేసుకుందామన్నం.. వినకుంటే ఊరుకోం
  • ఏపీ తీరు నమ్మేటట్టు లేదు కాబట్టే కంప్లైంట్​ ఇచ్చాం: కేసీఆర్​

హైదరాబాద్‌, వెలుగు‘‘నీళ్ల గురించి కేసీఆర్​తోనే మాట్లాడుతరా.. లెక్కలు నాకే చెప్తరా.. మతి ఉండాలె.. నీళ్ల పాలసీ మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. పోతిరెడ్డిపాడుపై ఇప్పుడే మాట్లాడదల్చుకోలే. టైమ్​ వచ్చినప్పుడు మాట్లాడుత..” అన్నారు సీఎం కేసీఆర్​. రాయలసీమకు నీళ్లు పోవాలని తాను అన్నది వాస్తవమేనని, ఇప్పుడు కూడా అంటున్నానని పేర్కొన్నారు. గోదావరి నదిలో వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని, వాటిని మళ్లించుకొని తీసుకుపొమ్మని చెప్పానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన కేటాయింపుల మేరకే అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని.. దాని మేరకే అందరూ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

సోమవారం ప్రగతి భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నలకు కేసీఆర్​ జవాబిచ్చారు. ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, రాయలసీమ లిఫ్ట్​ స్కీమ్​లను చేపట్టిన విషయాన్ని ప్రస్తావించగా.. ఇప్పుడే దాని గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. ‘‘నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్​కు, తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఒక విషయం క్లియర్​గా చెప్తున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపిన కేటాయింపుల మేరకే అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. దాని మేరకే అందరం ఉండాలని కోరుకుంటున్నం. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడుత..’’ అని చెప్పారు.

వాళ్లు మాట్లాడితే నాకే మైలేజ్..

ఏపీ కొత్త ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను ప్రస్తావించగా.. సీఎం మండిపడ్డారు. ‘‘ఎవడయా ప్రతిపక్షం.. ఏదో అర్థం ఉండి మాట్లాడితె బాగుంటది. నాకా చెప్పేది. మీకు అర్థం అవుతుందా.. నీళ్ల గురించి కేసీఆర్​తో మాట్లాడుతరా. మతి ఉండాలె. పరువు తీసుకునుడు ఎందుకు? పనికిమాలినయన్ని మాట్లాడుతరు. వాళ్లు మాట్లాడితె నాకే మైలేజ్.. ” అని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తాము పోతిరెడ్డిపాడు మీద అరివీర భయంకరంగా కొట్లాడామని.. కొందరు నేతలు నాడు చెంచాగిరీ చేస్తూ, ఆంధ్రా సీఎంలకు సంచులు మోశారని విమర్శించారు. ఏపీ చేసిన ఫిర్యాదులపై మీటింగ్​ పెట్టి ప్రొటెస్టు చేశామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఏపీ పాత సర్కారు సుప్రీంకోర్టులో కేసు వేసిందని, కోర్టు సూచనల మేరకు అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ పెట్టామని చెప్పారు. అప్పుటి ఏపీ సీఎం, తాను మాట్లాడి ఓకే చేశామన్నారు.

మంచిగ చెప్పినం.. కాదంటే ఊరుకోం..

కృష్ణా నీళ్ల విషయంలో ఏపీ తాను చేసేపని చేస్తోందన్న అంశంపై కేసీఆర్​ స్పందిస్తూ.. ‘‘అది వాళ్ల ఖర్మ.. వాళ్లను పిలిచి భోజనం పెట్టి, కూసోబెట్టి మాట్లాడిన. బేసిన్లు లేవు.. భేషజాల్లేవు.. బ్రహ్మాండంగ నీళ్లు వాడుకోండన్న. మేం వాడుకుంటం.. మీరు వాడుకోండి. ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యి టీఎంసీలు ఎక్కువున్నయని చెప్పిన. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బస్తీమే సవాల్​ అనుకుంట వచ్చిన్రు. పచ్చ జెండాలు పట్టుకుని కర్ణాటక బార్డర్​కు పోవడం, తొడగొట్టి సుప్రీంకోర్టుకు పోవడం తప్ప చేసిందేం లేదు. అదే నేను సామరస్య పూర్వకంగా మహారాష్ట్రతో మాట్లాడి కన్విన్స్​ చేసిన. ఇట్లా చేసుకొమ్మని చెప్పిన. అట్లా కాదు మేం వేరే అంటే ఊరుకోం. రాయలసీమకు నీళ్లు అవసరం అన్నప్పుడు కడుపునిండా తీసుకపోండ్రి అని చెప్పినం. మంచిగ చేసుకుందామన్నం. వాళ్ల తీరు నమ్మేటట్టు లేదు కాబట్టే కంప్లైంట్‌ ఇచ్చినం. మాకు అనుమానం కలిగించే పద్ధతిలో, మాకు దెబ్బకొట్టే పద్ధతిలో వస్తే.. తప్పకుండా ప్రొటెస్ట్‌ చేస్తం’’ అన్నారు. ఏపీతో స్నేహం విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘ఇప్పుడు కూడా కలిసే పనిచేస్తున్నం. మాకే వివాదాలు లేవు.. అన్యోన్యంగా కలిసే ఉన్నం.. కలిసే ఉంటం.. మంచిగ ఉంటే కొందరి కండ్లు మండుతున్నట్టున్నయి. అయినా ఏపీ నీళ్లన్నీ తీసుకుంటమంటె ఊరుకుంటమా? లేదు.. కొట్లాట అంటే కొట్లాటనే..’’ అని చెప్పారు. గోదావరిలో రాష్ట్రానికి 650 టీఎంసీల సర్‌ ప్లస్‌ వాటర్‌ కావాలని సీడబ్ల్యూసీని అడుగుతున్నామని కేసీఆర్​ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ‘గోదావరి టు- కావేరి’ నీళ్ల తరలింపు అంటోందని.. తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని చెప్పారు. గోదావరిలో సర్‌ ప్లస్‌ నీళ్లు ఉన్నాయనే.. రాయలసీమకు తరలించుకోవాలని ఏపీకి సూచించానని తెలిపారు.

టెస్టులు చేయకుండా గ్రీన్ జోన్లుగా ఎట్ల మారుస్తరు.?