పోలీసుల ముందు లొంగిపోండి...నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం

పోలీసుల ముందు లొంగిపోండి...నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం
  • హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన సుప్రీం బెంచ్ 
  • పలు అంశాల ఆధారంగా రెండేండ్ల జైలు శిక్ష ఖరారు
  • దాదాపు 24 ఏండ్ల తర్వాత వెలువడిన తుది తీర్పు  
  • 2002లో సిద్ధార్థరెడ్డితో 
  • కలిసి విషం తాగిన ప్రత్యూష
  • చికిత్స పొందుతూ 
  • ఆమె చనిపోగా.. ప్రాణాలతో బయటపడ్డ సిద్ధార్థ

న్యూఢిల్లీ/హైదరాబాద్​ సిటీ, వెలుగు: తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో దాదాపు 24 ఏండ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు (ఉమ్మడి ఏపీ హైకోర్టు) విధించిన రెండేండ్ల జైలు శిక్షను సమర్థించింది. ప్రత్యూష మరణానికి సంబంధించి చార్జ్ షీట్ లో పొందుపరిచిన మొత్తం 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ.. 2012, జనవరిలో సిద్ధార్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

అలాగే ప్రత్యూషపై అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటినుంచి14 ఏండ్లుగా ఈ కేసులో17 పర్యాయాలు సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు విన్నది. చివరగా గతేడాది నవంబర్ 19న ఇరు వైపు సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ తోకూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షను సమర్థిస్తున్నట్లు వెల్లడించింది. ‘గొంతు కోసి చంపడం వల్ల హత్య జరిగిందన్న ఆరోపణలను తోసిపుచ్చుతున్నాం. కంటి, వైద్య ఆధారాలు విష ప్రయోగం వల్ల మరణాన్ని రుజువు చేస్తున్నాయి. 

ప్రత్యూష తల్లి ఆరోపించినట్లు అత్యాచార నేరం నిర్ధారణ కాలేదు. అయితే, సిద్ధార్థ న్యూరాన్ టోన్ విషాన్ని కొనుగోలు చేశాడని తేలింది. తద్వారా అతడు ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా నిరూపితమైంది’ అని బెంచ్ తీర్పు కాపీలో పేర్కొంది. మరోవైపు డాక్టర్ మునిస్వామి అనైతిక పోస్టుమార్టం రిపోర్టును అందించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. తద్వారా ఈ రిపోర్ట్ ముందస్తు, ఉద్దేశపూర్వకంగా ప్రచురించడం వల్ల కలిగే పరిణామాలపై కోర్టు మందలించింది. ఇద్దరు కలిసి చేసుకున్న ఆత్మహత్య ఒప్పందంలో జీవించి ఉన్న భాగస్వామి చట్టపరంగా దోషి అని.. ఈ కారణాల వల్ల ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో అప్పీల్ దారు అయిన సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. 

2002, ఫిబ్రవరిలో ఘటన.. 

ప్రత్యూష, సిద్ధార్థరెడ్డికి ఇంటర్మీడియెట్ చదువుతుండగా పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. ఆమె నటిగా ఎదుగుతున్న సమయంలో విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరూ కలిసి మరణించాలని డిసైడ్ అయి.. 2002, ఫిబ్రవరి 23న సాయంత్రం కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మరునాడు చనిపోగా.. సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థే పురికొల్పాడని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా సిద్ధార్థపై 306( ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద చార్టిషీటు దాఖలు చేసింది. 

ఈ కేసులో తొలుత 2004లో సెషన్స్ జడ్జి సిద్ధార్థకు ఐదేండ్ల జైలుశిక్ష, రూ.5 వేల ఫైన్ విధించారు. ఈ తీర్పును సిద్ధార్థ హైకోర్టులో సవాల్ చేయగా... హైకోర్టు శిక్షాకాలాన్ని రెండేండ్లకు తగ్గించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ 2012లో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరోవైపు ప్రత్యూషను హత్య చేశారని ఆమె తల్లి సరోజినీదేవి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

పూర్తి న్యాయం జరగలే: సరోజినీ దేవి 

నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నానని ఆమె తల్లి సరోజినీ దేవి చెప్పారు. అయితే, తమకు న్యాయం పూర్తిగా జరిగిందని అనుకోవట్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళశారం ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘నా కూతురిది సహజ మరణం కాదు. కిరాతకంగా చంపేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. 

పూర్తి ఆధారాలు బయటికి వచ్చి ఉంటే అతడికి జీవిత ఖైదు పడేది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ మునిస్వామి రిపోర్టును కోర్టులు పట్టించుకోలేదని, త్రిసభ్య కమిటీ రిపోర్టుకే ప్రాధాన్యం ఇచ్చాయన్నారు. ఈ కేసులో అసలు నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. తన కూతురు మృతదేహాన్ని కూడా తాను చూడలేదని వాపోయారు. ప్రభుత్వం తన కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.