- నిత్యం 80 టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి
- కంపు కొడుతున్న పలు కాలనీలు
- ఇబ్బంది పడుతున్న ప్రజలు
వనపర్తి, వెలుగు: జిల్లాలోని 5 మున్పిపాలిటీల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారింది. చెత్త తరలించేందుకు సరిపడా వాహనాలు లేకపోవడంతోపాటు ఉన్నవాటిలో కొన్ని రిపేర్లకు వస్తున్నాయి. ఫలితంగా పలు కాలనీల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. వనపర్తి, అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు మున్సిపాలిటీల్లో కలిపి రోజుకు 80 టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. రోగాలబారిన పడతామని ప్రజలకు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి, చెత్తను వెనువెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రైవేట్ వాహనాల ద్వారా సేకరణ
వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులు ఉన్నాయి. వార్డుకొకటి చొప్పున చెత్త సేకరణ వాహనాన్ని ఏర్పాటు చేయాలి. కానీ, లక్ష జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో కేవలం 17 వాహనాలే ఉన్నాయి. వీటిలో 13 ట్రాక్టర్లు, 4 ఆటోలు. 12 వాహనాలను ప్రైవేటుగా ఏర్పాటు చేశారు. ప్రైవేట్వ్యక్తులు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.60 వసూలు చేసుకునేందుకు మున్సిపాలిటీ అనుమతించింది. కానీ, ప్రైవేట్వాహనాల నిర్వాహకులు రూ.100, రూ.120 వరకు తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్తతోపాటు ఇతర పాత సామగ్రి వేస్తే అదనంగా డబ్బులు డిమాండ్చేస్తున్నారని వాపోతున్నారు.
తరచూ రిపేర్లు..
కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణ అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ వాహనాలు తరచూ రిపేర్లకు వస్తున్నాయి. పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 3 వాహనాలు కేటాయించగా.. వీటిలో 2 సక్రమంగా పని చేయడం లేదు. ప్రైవేట్వాహనాల నిర్వాహకులు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారని మున్సిపల్ ఆఫీసర్లకు చెబితే.. నిర్ణయించిన దానికంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని ముక్తసరిగా సమాధానమిస్తున్నారని స్థానికులు
చెబుతున్నారు.
వాహనాలు, రోజువారీ చెత్త(టన్నుల్లో) వివరాలు
మున్సిపాలిటీ వార్డులు వాహనాలు చెత్త
అమరచింత 10 5 10
ఆత్మకూరు 10 5 12
పెబ్బేరు 12 3 12
కొత్తకోట 15 9 16
వనపర్తి 33 29 32
