- సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధంలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ విషయంలో కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు.
వాషింగ్టన్: లైంగిక వేధింపుల కేసు దోషి జెఫ్రీ ఎప్ స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధంలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో తన పేరు వెలుగులోకి రావడంపై తాజాగా ఆయన స్పందించారు. ఈ వ్యవహారంలో తాను రహస్యంగా దాచుకునే విషయమేదీ లేదన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ఎప్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ విషయంలో కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఎప్ స్టీన్ తనకు వ్యతిరేకంగా పనిచేశాడని, ఒక రచయితతో కలిసి తాను ఎన్నిక కాకుండా ప్రయత్నించాడని ఆరోపించారు. ‘‘2000 సంవత్సరంలో నా ఎస్టేట్ మారాలాగోలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని నాకు తెలియకుండానే ఎప్స్టీన్ నియమించుకున్నాడు. అప్పటి నుంచి ఎప్స్టీన్తో నేను సంబంధాలు తెంచుకున్నాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరోవైపు వైట్ హౌస్ కూడా ఎప్స్టీన్తో ట్రంప్‌కు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారొలిన్ లీవిట్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రెసిడెంట్ చెప్పేది నిజమని అన్నారు. ఎప్స్టీన్ ఒక గూఢచారి అని తేలడంతో మారాలాగోలోని తన క్లబ్ నుంచి ట్రంప్ అతడిని బయటకు పంపించారని ఆమె తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో ట్రంప్ నిజాయితీగా ఉన్నారని, ఎలాంటి విషయం కూడా దాచలేదని చెప్పారు.
