- చైర్‌పర్సన్‌గా షాహీన్ సుల్తానా
- వైస్ చైర్ పర్సన్ పదవికి ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ల పోటీ
- చెరో 15 ఓట్లు రావడంతో డ్రాలో అనిత ఎంపిక
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్‌నగర్ బల్దియా కాంగ్రెస్ వశమైంది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో 30 మంది వార్డు కౌన్సిలర్లకు గాను ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే హరీశ్ బాబు
ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకు న్నారు. 32 మంది ఓట్లకు గాను 31 మంది మీటింగ్‌లో పాల్గొన్నారు. మొదట చైర్ పర్సన్ కోసం బీఆర్ఎస్ నుంచి సీపీ విద్యావతి పేరును కౌన్సిలర్వనమాల శ్రీధర్ ప్రతిపాదించారు. ఇండిపెండెంట్ వసీం బలపరిచారు. బీఆర్ఎస్కు చెందిన 11 మంది, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఓ ఎంఐఎం, సహా బీజేపీ కౌన్సిలర్ డాక్టర్ అనిత మద్దతు తెలిపారు.
మొత్తంగా 15 ఓట్లు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ నుంచి18వ వార్డు కౌన్సిలర్ షాహీన్ సుల్తానా పేరును చైర్పర్సన్ గా 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద ప్రతిపాదించగా.. 26వ వార్డ్ కౌన్సిలర్ వసీమున్నీసా బలపరిచారు. ఆమెకు కాంగ్రెస్ 9, ముగ్గురు బీజేపీ, ఇద్దరు ఇండిపెండెంట్లతోపాటు పాటు ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే హరీశ్ బాబు చేతులు లేపి మద్దతు పలికారు. 16 ఓట్లు వచ్చిన షాహిన్ సుల్తానా చైర్‌పర్సన్‌గా గెలుపొందినట్లు ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్, సీఈవో లక్ష్మీనారాయణ ప్రకటించారు.
‘వైస్’ కోసం పోటీ పడ్డ ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు
అనంతరం జరిగిన వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఆసక్తిగా మారింది. పదవికి ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు పోటీ పడ్డారు. డాక్టర్ కొత్తపల్లి అనిత పేరును ఇండిపెండెంట్ వసీం ప్రతిపాదించగా.. బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్రీధర్ బలపరిచారు. ఇద్దరికీ ఓటింగ్ చేపట్టగా చెరో 15 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్‌లో27వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సిద్ధం రాజేశ్వరి ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో డ్రా తీశారు. డ్రాలో డాక్టర్ కొత్తపల్లి అనిత పేరు రాగా ఆమెను గెలిచినట్లు ప్రకటించారు. అనంతరం ఎన్నికల ఆఫీసర్‌తోపాటు ఎన్నికల అబ్జర్వర్ అలోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి సమక్షంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ప్రమాణం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్ ఎక్స్అఫీషియో ఓటు చెల్లదంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆబ్జెక్షన్ చెప్పగా ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన లిస్ట్ ఆధారంగా నడుచుకుంటామని అధికారులు ప్రకటించారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీలు నితికా పంత్, అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
పట్టణ ప్రజల నమ్మకాన్ని నిలబెడతం: ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని, పట్టణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా మరింత బాధ్యతగా అభివృద్ధికి పాటుపడతామని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా ఎన్నిక అనంతరం ఆయన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంతో పాటు పలు మండలాల్లో కాంగ్రెస్ నేతలు టపాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
