మంత్రి వివేక్ కాన్వాయ్‌‌పై బాల్క సుమన్ దాడి

మంత్రి వివేక్ కాన్వాయ్‌‌పై బాల్క సుమన్ దాడి
  • మంత్రి వెహికల్‌‌పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం
  • ఎక్స్ అఫీషియో ఓట్లను అడ్డుకునే యత్నం..
  • క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత
  •  దాడిలో పోలీసులు, కాంగ్రెస్ ​కార్యకర్తలకు తీవ్ర గాయాలు
  • ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
  •  కౌన్సిలర్ల మధ్య గొడవ.. చైర్​పర్సన్ ​ఎన్నిక వాయిదా

కోల్‌‌​బెల్ట్, వెలుగు:  మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్  చైర్​పర్సన్​, వైస్  చైర్​పర్సన్​ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయన అనుచరులు వీరంగం సృష్టించారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌‌పై రాళ్లతో  దాడి చేశారు.

మంత్రి వెహికల్‌‌ మీదికి ముందుగా  బాల్క సుమన్​ ట్రాఫిక్​ కోన్​ విసరడంతో బీఆర్ఎస్, సీపీఐ కార్యకర్తలు  రెచ్చిపోయారు. వీరి రాళ్ల దాడితో రామకృష్ణాపూర్‌‌‌‌కు వెళ్లే మార్గంలో రైల్వే ఫ్లై ఓవర్​ బ్రిడ్జి పరిసరాలు రణరంగంగా మారాయి. 

మంగళవారం ఉదయం చైర్‌‌‌‌ పర్సన్​, వైస్​ చైర్​ పర్సన్​ ఎన్నికలో  ఎక్స్​అఫీషియో సభ్యులుగా ఓటు వేయడానికి మంత్రి వివేక్​, ఎంపీ వంశీకృష్ణ కాంగ్రెస్​ కౌన్సిలర్లతో కలిసి  బయలుదేరారు. రైల్వే ఫ్లైఓవర్ ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఇంటి దగ్గర మంత్రి కాన్వాయ్‌‌ను  బీఆర్‌‌‌‌ఎస్​, సీపీఐ కార్యకర్తలు అడ్డుకొని రాళ్లు రువ్వారు.

సుమన్​ తన అనుచరులను రెచ్చగొడుతూ.. ఆయన స్వయంగా ట్రాఫిక్​కోన్‌‌ను మంత్రి వాహనంపైకి విసురుతూ హల్‌‌చల్​ చేశారు. పోలీస్​ ఆఫీసర్లను బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రాళ్లదాడిలో  మంత్రి  వాహనం అద్దాలు పగిలాయి. కానిస్టేబుల్​ రాకేశ్, కాంగ్రెస్​ కార్యకర్తలు జావిద్, తోకల సురేశ్‌‌తోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడినవారిని  మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి బీఆర్‌‌‌‌ఎస్, సీపీఐ లీడర్లు, కార్యకర్తలను చెదరగొట్టారు. దాదాపు 20 నిమిషాలపాటు ఫ్లై ఓవర్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. మంత్రి, ఎంపీతోపాటు 8 మంది కాంగ్రెస్​ కౌన్సిలర్లకు పోలీసులు రక్షణ కల్పించి  అక్కడి నుంచి క్యాతనపల్లి మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. అప్పటికే  14 మంది బీఆర్‌‌‌‌ఎస్​, సీపీఐ కౌన్సిలర్లు మున్సిపల్​ ఆఫీస్‌‌కు  చేరుకున్నారు.

ఎన్నిక వాయిదా..

క్యాతనపల్లి మున్సిపాలిటీలో స్పెషల్​ఆఫీసర్, మందమర్రి తహసీల్దార్ సతీశ్‌‌కుమార్  ఉదయం 11 గంటలకు​  22 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత  చైర్​ పర్సన్, వైస్​ చైర్ పర్సన్​ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధం కాగా.. కౌన్సిలర్ల మధ్య గొడవ తలెత్తింది. దీంతో కాంగ్రెస్​ కౌన్సిలర్లను వెంటబెట్టుకొని మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ  బయటకు వెళ్లిపోయారు.

గొడవ కారణంగా  చైర్​ పర్సన్ ఎన్నిక వాయిదా వేసినట్లు స్పెషల్​ ఆఫీసర్  ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం  తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. ఆఫీసర్ల తీరును బీఆర్ఎస్,​ సీపీఐ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. 14 మంది బీఆర్‌‌‌‌ఎస్​, సీపీఐ కౌన్సిలర్లం ఆఫీసులోనే ఉన్నామని, వెంటనే  ఎన్నిక నిర్వహించాలని డిమాండ్​ చేశారు.  సాయంత్రం 3.30 గంటల వరకు వారు ఆఫీసులోనే ఉన్నారు. ఆఫీసర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.