దేవుడికి  గంజాయి ప్రసాదం!..శంషాబాద్లోని టెంపుల్లో యువకుల రీల్స్  

దేవుడికి  గంజాయి ప్రసాదం!..శంషాబాద్లోని టెంపుల్లో యువకుల రీల్స్  
  • కేసు నమోదు చేసిన పోలీసులు 
  • ‘ఖాలీ మెంటల్​ ఉంటది.. సూడుర్రి మీరే’ అంటూ చేతిలో గంజాయితో వీడియో  
  • వైరల్ ​కావడంతో స్పందించిన సీపీ సజ్జనార్​
  • నిందితులను పట్టుకున్న టాస్క్​ఫోర్స్ 

హైదరాబాద్​సిటీ/ఓల్డ్​సిటీ, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా శంషాబాద్‌ ధర్మగిరి దేవాలయంలో శివుడికి కొందరు ఆకతాయిలు గంజాయి ప్రసాదంగా పెట్టారు. పైగా వారు చేసే పనిని వీడియో తీసి ఇన్​స్టా గ్రామ్​లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారి.. సీపీ సజ్జనార్​దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్​మీడియా వేదికగా స్పందించారు. నిందితులను పట్టుకుని, శిక్ష పడేలా చేస్తామని ప్రకటించారు. అనంతరం నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్​టాస్క్​ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు సభావత్ శ్రీచరణ్​(21), వరైవత్​విజయ్​కృష్ణ(19)ను పట్టుకొని ఫలక్​నుమా పోలీస్​స్టేషన్​లో అప్పగించారు.  
ఏం జరిగిందంటే.. 
మహాశివరాత్రి సందర్భంగా శంషాబాద్ ధర్మగిరి దేవాలయానికి భక్తులు తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి పండ్లు, పాలు ప్రసాదంగా సమర్పిస్తున్నారు. అక్కడికి జంగమ్మెట్​కు చెందిన సభావత్ శ్రీచరణ్, వరైవత్ ​విజయ్​కృష్ణ వచ్చారు. ‘సో.. గయ్స్​శివునికి ఒక ప్రసాదం పెట్టనీకే వచ్చినం. మనం ఏ ప్రసాదం పెడుతున్నా.. ఖాలీ మెంటల్​ ఉంటది.. సూడుర్రి మీరే. అందరూ కొబ్బరికాయలు, గిబ్బరికాయలు కొట్టనీకే వస్తరు. మనం గిట్ల కాదు. శివునికి ఫేవరెట్​ఉండాలె’ అంటూ చేతిలో గంజాయి చూపించారు. తర్వాత గంజాయిని దేవుడి ముందు పెట్టి వీడియో తీశారు. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేయగా వైరలయ్యింది. కాగా, ఈ వీడియో విషయం కాస్తా హైదరాబాద్ సీపీ సజ్జనార్​దృష్టికి వెళ్లడంతో ఆయన ‘ఎక్స్’ ​వేదికగా స్పందించారు. ‘దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? ఏదో సాహసం చేశామని అనుకుంటున్నారా? ఈ చర్యలను ఉపేక్షించబోం. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన హెచ్చరించారు.