
- మూడేండ్ల కిందటిదాకా గజ్వేల్ అటవీ భూమి ఎడారిలెక్క ఉండె
- పక్కా ప్రణాళికతో పచ్చగా మార్చినం
- అదే స్ఫూర్తితో ప్రణాళిక రూపొందించి పనులు మొదలుపెట్టండి
- కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచన
- గజ్వేల్ అడవులను కలెక్టర్లకు చూపించిన సీఎం
- కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై చర్చ
హైదరాబాద్/ సిద్దిపేట, వెలుగు: ‘‘చూస్తున్నరా ఈ చెట్లను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఇక్కడ ఎడారిలెక్క ఉండె. ఇప్పుడు పచ్చబడింది. ఇట్లనే రాష్ట్రమంతా కావాలె”అని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. గజ్వేల్ నియోజకవర్గం సింగాయిపల్లి, నెంటూరు, కోమటిబండ ప్రాంతాల్లో చేపట్టిన అడవుల పెంపకం పనులను వారికి చూపించారు. గజ్వేల్మోడల్తో ముందుకు సాగాలని కలెక్టర్లతో సీఎం అన్నారు. రాష్ట్ర విస్తీర్ణంలో 23.4 శాతం అటవీ భూములు ఉన్నప్పటికీ, అడవులు మాత్రం ఆశించినంత లేవని తెలిపారు. అందుబాటులో ఉన్న 66.48 లక్షల ఎకరాల అటవీ భూముల్లో అడవులను మళ్లీ పెంచడానికి వెంటనే ప్రణాళికలు రూపొందించి, కార్యాచరణ మొదలుపెట్టాలన్నారు. ‘‘గజ్వేల్ నియోజకవర్గంలో అడవులను మళ్లీ పెంచడానికి మూడేండ్ల క్రితం సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేశాం. దాని ఫలితం మనకు కనిపిస్తున్నది. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. వర్షపాతం కూడా పెరిగింది. 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచినం. దీంతో ఇవి మంకీ ఫుడ్ కోర్టుల్లాగా తయారవుతున్నయి. అడవుల పెంపకంలో గజ్వేల్ మోడల్‌ను రాష్ట్రమంతా అమలు చేయాలి’’ అని సూచించారు. ఉన్న అడవులను కాపాడుకోవాలని, అందులో మొక్కలు నాటాలని తెలిపారు. ఈ బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తీసుకోవాలన్నారు.
అవినీతికి ఆస్కారంలేని చట్టాలు తెస్తున్నం
అటవీ ప్రాంత సందర్శన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వారితో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన సమావేశంలో చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం సూచించారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని చెప్పారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇట్ల పెంచినం
గజ్వేల్‌లో అడవుల పెంపకం కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ జిల్లాల కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ ను ఉపయోగించుకొని, సహజమైన పద్ధతిలో మొక్కల పెంపకం చేపట్టామని తెలిపారు. అడవుల్లో జంతువులు బయటకు రాకుండా, బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా అడవి చుట్టూ కందకాలు తవ్వించామని చెప్పారు. కందకాల్లో నీటి నిల్వతో చెట్లకు తేమ అందుతుందన్నారు. కందకాల గట్లపై పెంచిన గచ్చకాయ చెట్లు అడవికి సహజ రక్షణగా ఉపయోగపడుతాయని తెలిపారు. కోతులు జనావాసాల నుంచి అడవుల్లోకి మళ్లేందుకు 27 రకాల పండ్ల చెట్లను అడవుల్లో పెంచుతున్నామని వివరించారు. ఆయా జిల్లాల్లో అడవుల పునరుద్ధరణకు అవసరమయ్యే కాంపా నిధులు అందుబాటులో ఉన్నాయని, చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు అటవీశాఖ ద్వారా తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
అడుగడుగునా ఆంక్షలు
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. సింగాయిపల్లి, నెంటూరు, కోమటి బండ ప్రాంతాల్లోని రహదారులపై ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. కోమటి బండ మిషన్ భగీరథ ప్లాంటుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచే రాకపోకలను ఆపేశారు. కేసీఆర్ కాన్వాయ్ లోపలికి వెళ్లేదాకా ఎవరినీ దరిదాపులకు కూడా రానివ్వలేదు. పోలీసుల ఆంక్షల వల్ల ఈ దారుల్లో ప్రయాణించిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గంటలకొద్ది రోడ్డుపై పడిగాపులు కాశారు. కోమటిబండ, సంగాయిపల్లి వద్ద మీడియా ప్రతినిధులను కిలో మీటరు దూరంలోనే నిలిపివేశారు. కోమటి బండ వద్ద సీఐ ప్రసాద్ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.