
- త్వరలోనే ఐఆర్ ఇచ్చి, పీఆర్‌సీ నియమిస్తం: సీఎం కేసీఆర్
- సింగరేణి కార్మికులకు రూ. వెయ్యి కోట్ల బోనస్
- నెల రోజుల్లో రైతు రుణమాఫీ
- మరో 7 వేల మంది మౌజంలకు నెలకు రూ.10 వేలు
- మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఖబరస్థాన్‌లకు భూములు
- మా దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నయ్
- గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా కుదరదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశం ఆశ్చర్యపోయేలా పే స్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే వారి జీతాలు 70 శాతం పెంచామని, మరోసారి బ్రహ్మాండంగా పెంచుతామన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు సమకూరితే ఏం చేసుకుంటాం? ఉద్యోగులు కూడా మా పిల్లలే. రాష్ట్రం ధనికమైతే, వాళ్లు కూడా ధనికులు కావాలె. నాలుగు రూపాయలు వాళ్లకు కూడా రావాలే. తప్పకుండా షార్ట్ పీరియడ్‌లో కొంత ఐఆర్ ఇచ్చేసి, పీఆర్‌సీ అపాయింట్ చేస్తాం. రికమెండేషన్స్ అనుసరించి మళ్లొకసారి దివ్యంగా పెంచుతాం’’ అని సీఎం వెల్లడించారు.
స్వరాష్ట్రంలో గత పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన షార్ట్ డిస్కషన్ సందర్భంగా సీఎం మాట్లాడారు. సీపీఎస్ అమలుపై చిక్కుముడులు ఉన్నాయని, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అమలుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాయన్నారు. సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ కింద ఈ సారి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించారు. నెల రోజుల్లోనే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు.
రైతు బంధు నగదును కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మరో 7 వేల మంది మౌజంలకు నెలకు రూ.10 వేలు ఇచ్చే అంశంపై సోమవారమే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ముస్లింల స్మశానాల కోసం భూములను కేటాయిస్తామన్నారు. అవసరమైతే గురుకుల ఎగ్జామ్స్ తేదీలు మార్చి, గ్రూప్ 2 ఎగ్జామ్‌కు ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. కానీ గ్రూప్ 2ను వాయిదా వేసేందుకు కుదరదన్నారు.
కడుపు, నోరు కట్టుకుని పని చేసినం
కడుపు, నోరు కట్టుకుని పనిచేస్తేనే రాష్ట్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3.12 లక్షలు ఉంటే, ఆంధ్ర తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలేనని చెప్పారు. కాంగ్రెస్ 70 ఏండ్లలో చేయని అభివృద్ధిని, తాము 9 ఏండ్లలోనే చేశామన్నారు.
జగన్‌ను మిస్ హ్యాండ్లింగ్ చేసిన్రు
వైఎస్ఆర్ చనిపోయాక ఆయన కొడుకు జగన్‌ను కాంగ్రెస్ మిస్ హ్యాండ్లింగ్ చేసిందని కేసీఆర్ అన్నారు. ‘‘ఆంధ్రలో జగన్ భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందడంతో, ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ ఖతమైందని వాళ్లకు అర్థమైంది. తెలంగాణ ఇస్తే, ఈ ప్రాంతంలోనైనా ఓ పది సీట్లు వస్తాయని ఆశించి, తెలంగాణ ఇచ్చారు. బీజేపీ వాళ్లు ఒక్క ఓటు రెండు సీట్లు అని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఎందుకు అని కించపరిచారు. కాంగ్రెస్ వాళ్లు తల్లిని చంపి, బిడ్డను బతికించారని ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అయినా అభివృద్ధి ఆగలేదు” అని చెప్పారు. దేశంలో అప్పులు తక్కువగా చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని కేంద్ర ప్రకటించిందని, మనం అప్పుల్లో 23వ స్థానంలో ఉన్నామన్నారు. ః
పిండం ఎవరికో ప్రజలు నిర్ణయిస్తరు
ఉమ్మడి రాష్ట్రంలో వీఆర్‌ఏ, వీఆర్‌వో, ఆర్‌ఐ, ఎంఆర్‌వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, రెవెన్యూ మినిస్టర్ అని పది మంది భర్తలు ఉండేటోళ్లని, వీరిలో ఎవరికి కోపం వచ్చినా రికార్డుల్లో రైతు భూమి గల్లంతు అయ్యేదని సీఎం అన్నారు. ‘‘మేం ధరణి తెచ్చాక భూమికి రైతే భర్త అయిండు. అట్లాంటి ధరణిని రద్దు చేస్తామని, నాకు పిండం పెడతామని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు. ఎవరికి పిండం పెట్టాలో వచ్చే ఎన్నికల్లో ప్రజలే చెప్తారు” అని తెలిపారు.
ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ
‘‘మేం సెక్యులర్ పార్టీ అని ప్రకటించుకున్నం. సెక్యులర్‌గానే ఉంటం. మజ్లిస్– బీఆర్‌ఎస్ ఫ్రెండ్లీ పార్టీలు. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా ఫ్రెండ్లీ పార్టీలుగానే ఉంటాయి” అని కేసీఆర్ చెప్పారు.
ఇంకా గంపెడు స్కీములున్నయి
కాంగ్రెస్ వాళ్లు ఏవో అలవికాని హామీలు ఇచ్చి గెలుద్దాం అనుకుంటున్నరని, కానీ అవేవీ ప్రజలు నమ్మరని కేసీఆర్ అన్నారు. ‘‘మేం చేసేదే చెబుతాం. చెప్పిందే చేస్తాం. గత ఎన్నికలప్పుడు మేము లక్ష రుణమాఫీ అంటే వాళ్లు 2 లక్షలు అన్నరు. జనం గుద్దుడు గుద్దితే మాకు 80 సీట్లు వచ్చినయి. ఇప్పుడు ఇంకో ఏడెనిమిది సీట్లు ఎక్కువనే గెలుస్తాం. మా దగ్గర ఇంకా గంపెడు స్కీములు రెడీగా ఉన్నయి. మేం ఆ అస్త్రాలు తీసినప్పుడు విపక్షాలు గాలిలో కొట్టుకుపోతయి.
బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానన్న వ్యక్తి(బండి సంజయ్‌ను ఉద్దేశించి) పత్తా లేకుండా పోయిండు. కేంద్రంలో మమ్మల్ని రాచిరంపాన పెట్టే పార్టే అధికారంలో ఉన్నప్పటికీ, మేము చేస్తున్న పనులకు 3 నెలలకోసారి అవార్డులు ఇవ్వక వాళ్లకు తప్పడం లేదు. దేశంలో 24 గంటలు కరెంట్, ప్రతి ఇంటికీ మంచి నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనది. పండిన ప్రతి గింజనూ కొంటున్న ఏకైక రాష్ట్రం. ఇలా ఎన్నో ఉన్నాయి” అని సీఎం వివరించారు.
తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ వాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక్కడి ప్రజలకు ఇష్టం లేకుండా 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఎన్ని దశాబ్దాలు పోరాడినా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. ఉద్యమాలను అణచివేశారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెడుతున్నా, ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోం అని అసెంబ్లీలో ప్రకటించినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌన పాత్ర వహించారు. కేసీఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్ర యాత్రనో అని నేను నిరాహార దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది.- సీఎం కేసీఆర్