నల్గొండ, వెలుగు: నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ప్రసాద్ ఉడుపి హోటల్‌లో సోమవారం రాత్రి సాంబార్‌లో జెర్రీ కనిపించడం కలకలం రేపింది. రాత్రి 11 గంటల సమయంలో ఇడ్లీ తినేందుకు వచ్చిన జయచందర్, అక్షయ్, వరుణ్ సాంబార్‌లో ఉన్నదాన్ని తొలుత కొత్తిమీరగా భావించారు. నోటి దగ్గరికి తీసుకుని తినే సమయంలో కోరలు కనిపించడంతో అది జెర్రీ అని గుర్తించారు.
ఈ విషయాన్ని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా విషయం బయటకు రాకుండా సాంబార్‌ను లోపలికి తీసుకెళ్లి మోరిలో పారబోశారని ఆరోపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటల్‌ను తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటల్ కిచెన్ పక్కన ఉన్న చీకటి గదిలో రహస్యంగా విచారణ నిర్వహించి, ఫిర్యాదుదారులతో మాట్లాడకుండానే హోటల్ యాజమానితో చర్చలు జరిపినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
అనంతరం ఫిర్యాదుదారుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని చెట్నీ, ఆహార పదార్థాలు, నూనెలను సీజ్ చేసినట్లు సమాచారం. హోటల్‌లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన పత్రాలు కనిపించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని వెల్లడిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి స్పందిస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పిస్తామని, మీడియాకు సమాచారం డీపీఆర్‌ఓ ద్వారానే అందుతుందని తెలిపారు.
