మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న శివాజీ, లయ కొంత గ్యాప్ తర్వాత కలిసి నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈటీవీ విన్ సమర్పణలో బన్నీ వాస్, వంశీ నందిపాటి నిర్మించారు. మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా లయ చెప్పిన విశేషాలు. ‘‘శివాజీ గారు నేను కలిసి నటించి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఈ చిత్రంలో నటించాలి అనగానే ఫ్యామిలీ డ్రామా అనుకున్నా. కానీ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ జానర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. అందరికీ కనెక్ట్ అవుతుంది.
కామెడీతోపాటు ఇంటరెస్టింగ్ ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో ఉత్తర పాత్రలో కనిపిస్తా. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. మంగపతి లాంటి పవర్‌ఫుల్ పాత్ర చేసిన హీరోను డామినేట్ చేసే పాత్ర నాది. కానీ శివాజీ గారు ఎంతో ఎంకరేజ్ చేశారు. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఎంతో హిలేరియస్‌గా ఉంటాయి. మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ఆడియెన్స్ థియేటర్స్ నుంచి వెళ్తారు. ప్రస్తుతం జగపతిబాబు గారితో ‘వదల’ మూవీతో పాటు శ్రీకాంత్ గారితో ఓ సినిమా చేస్తున్నా’’.
