హిట్, యానిమల్, లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలతో నటుడిగా ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. బాల సతీష్ దర్శకుడు. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ ‘తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. దురలవాట్లతో దారితప్పిన ఒక పొగరుబోతును అతని తల్లి, భార్య ఎలా దారిలోకి తీసుకొచ్చారనేది మెయిన్ కాన్సెప్ట్.
కామెడీ జానర్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబమంతా కలిసి నవ్వుకునేలా ఉంటుంది. ‘100% లవ్’ వెబ్ సిరీస్ ఫేమ్ గాయత్రీ రమణ ఇందులో హీరోయిన్‌గా నటించింది. తను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. సతీష్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత రాజేష్ అమెరికా నుంచి సినిమా అంటే చాలా ప్యాషన్ తో వచ్చారు. ఇందులో ఓ పాత్ర పోషించడంతోపాటు కొన్ని డైలాగ్స్ కూడా రాశారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాకి సోల్.
గత చిత్రాలకు భిన్నంగా కనిపించాలని, నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని మాస్ క్యారెక్టర్‌తో కూడిన ఈ సినిమాను ఎంచుకున్నాను. సమాజంలో చుట్టూ ఉన్న మనుషులే నేను పోషించిన ఈ క్యారెక్టర్‌కు రిఫరెన్స్. మల్లేష్‌గా మేకోవర్ అవడానికి నేను చాలా మారాల్సి వచ్చింది. ఈ చిత్రంతో ప్రేక్షకులు నటుడిగా నా పేరు గుర్తుపెట్టుకుంటారని నమ్ముతున్నా. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’లో నటిస్తున్నా. అలాగే సోలో హీరోగా కొన్ని కథలు వింటున్నా’ అని చెప్పాడు.
