ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్లు

ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్లు
  •     నీతి ఆయోగ్‌‌ మీటింగ్​కు పోతే 4 నిమిషాలే మాట్లాడాలె.. పల్లికాయలు బుక్కుకుంట కూసోవాలె 
  •     సలహాలు ఇస్తే పట్టించుకోరు
  •     వ్యవస్థలను మోడీ ప్రభుత్వం నాశనం చేస్తున్నది
  •     పాలు, చేనేత, శ్మశానాల మీద జీఎస్టీ ఎత్తేయాలె
  •     ఎన్‌‌పీఏ పేరిట కమీషన్లు తీసుకుంటున్నరని ఆరోపణ
  •     ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటన
  •     అనాథ పిల్లలను స్టేట్‌‌ చిల్ట్రన్‌‌గా డిక్లేర్ చేస్తున్నట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ మీటింగ్‌‌ను బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలియజేశామని తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. గత సమావేశాల్లో తాను చెప్పిన సూచనలు, సలహాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని, ఇప్పుడు వెళ్లడం వల్ల కూడా ప్రయోజనం ఉండబోదన్నారు. ‘‘నీతి ఆయోగ్​ మీటింగ్​కు పోతే నాలుగు నిమిషాలు మాట్లాడాలె.. నాలుగు గంటలు కూసోవాలె. ఆ పల్లికాయలు బుక్కుకుంటా.. మన్ను బుక్కుకుంటా.. అవన్ని ఏంటేంటియో పెడ్తరు. ఇన్ని పుట్నాలు, ఇన్ని పల్లికాయలు, ఇన్ని కాజు పలుకులు అవ్వొకటి ఇవ్వొకటి పెడ్తరు.. పొద్దుపోనోడల్లా అవి బుక్కుకుంట కూసోవాలె.. గంతే. ఇంకేం లేదు. ఆడికిపోయి నాలుగు నిమిషాలు చెప్తే ప్రభావం పడదు. అందుకే ప్రొటెస్ట్​ చేస్తే దేశమంతా చర్చ జరుగుతదని నిర్ణయించినం” అని ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ అనేది నిరుపయోగ, నిరర్ధక సంస్థగా మిగిలిపోయిందని ఆరోపించారు. ఆ సంస్థ మేధోమథనం బంద్ పెట్టి, ప్రధాని మోడీకి భజన చేసే సంస్థగా మారిందని దుయ్యబట్టారు. ఎవరైనా మేధావులు చెబితే  గతంలో ఉన్న ప్రధానమంత్రులు వినేవాళ్లని, మంచిని స్వీకరించి ఆచరణలో పెట్టేవాళ్లని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. 

దేశ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా మోడీ ప్రభుత్వం నెరవేర్చడం లేదని కేసీఆర్​ ఆరోపించారు. తెలంగాణలో తప్ప రైతులకు ఇంకెక్కడా సరిపడా కరెంట్ రావడం లేదని, సాగు, తాగు నీరు కూడా ఇవ్వడం లేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ట్యాంకర్లలో నీటిని కొనుక్కునే దుస్థితి ఉందని చెప్పారు. దేశంలో నిరుద్యోగం మునపెన్నడూ లేనంతగా 8.1 శాతానికి పెరిగిందన్నారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల జాడ లేకుండా చేయాలని కేంద్రం కుట్ర చేస్తున్నదని, అందులో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. 

నన్ను అద్భుతంగా చెప్పినవ్​ అన్నరు

‘‘నీతి ఆయోగ్ సమావేశాల్లో సీఎం స్థాయి వ్యక్తులకు కూడా ఎన్ని నిమిషాలు మాట్లాడాలో ముందే నిర్ణయించి, టైమ్‌ కాంగనే బెల్ కొడుతరు. కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే నవ్వుతరు. ఇదేం పద్ధతో అర్థం కాదు. ఓ నాలుగైదు రోజులు మీటింగ్ పెడితే నష్టమేముంది? ఓసారి నేను కొంత ఎక్కువసేపు మాట్లాడ్తా, బెల్ కొట్టొద్దని ముందే చెప్పిన. తెలంగాణ గురించి రెండు మూడు నిమిషాలు చెప్పి.. మొత్తం దేశం గురించే చెప్పిన.  దేశంలో 24 గంటలు కరెంట్ ఎట్ల ఇయ్యచ్చో, దేశంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఎట్ల ఇయ్యచ్చో లెక్కలతో చెప్పిన. సమావేశం తర్వాత ఒక 15, 16 రాష్ట్రాల సీఎస్‌లు వచ్చి.. అద్భుతంగా చెప్పిన్రని నన్ను అప్రిషియేట్ చేసిన్రు” అని కేసీఆర్​ అన్నారు. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టినం. ఇందులో కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు కూడా రాలేదు. గతంలో ప్లానింగ్ కమిషన్‌తో వాదించి ఒప్పించుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఎజెండా, పాలసీ ఎవడు తయారు చేస్తడో ఎవరికీ తెల్వదు.. అదో పెద్ద కన్ఫ్యూజన్” అని పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ వ్యవస్థలను జేబు సంస్థల్లాగా వాడుకుంటున్నరు. ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తం అంటున్నరు. ఇవన్నీ ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నయ్.. అడిగితే జైలులో వేస్తామని బెదిరింపులు. ఇదేనా పద్ధతి?’’ అని  ప్రశ్నించారు.  

ఉచితాలు సరే.. ఎన్​పీఏ స్కామ్ సంగతేంది?

‘‘నిత్యావసర వస్తువుల ధరలను అడ్డగోలుగా పెంచిన మోడీ.. ఉచితాలు బంద్‌ చేయాలని అంటుండు. ఉచితాలు బంజేయాలనే వాళ్లు, ఎన్‌పీఏ(నాన్ పర్‌‌ఫార్మింగ్ అసెట్స్‌)లు ఎందుకు ఇస్తున్నరు. ఎన్‌పీఏ 2014 నాటికి 2.63 లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు 20.07 లక్షల కోట్లు. ఇదో పెద్ద స్కామ్‌.. ఇప్పటికే 12 లక్షల కోట్లు ఇచ్చిన్రు.. కమీషన్లు తీసుకుని ఎన్‌పీఏ ఇస్తున్నరు. అభివృద్ధి సాధిస్తే ఎన్‌పీఏ తగ్గాలి కదా? ఎందుకు పది రెట్లు పెరిగింది?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.  ‘‘ఇండియాలో శ్రీలంక, పాక్ వంటి పరిస్థితులు దాపురిస్తున్నయని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నరు. దీన్ని కంట్రోల్‌ చేసేందుకు ఉచితాలంటూ పేదల నోళ్లు కొట్టి, లక్షల కోట్లు కార్పొరేట్ గద్దలకు కట్టబెడుతున్నరు”అని కేంద్రంపై సీఎం ధ్వజమెత్తారు. 2జీ స్ప్రెక్ట్రం తరహాలో 5జీ స్ప్రెక్ట్రం వేలంలోనూ భారీ కుంభకోణం జరిగిందని 
ఆరోపించారు.

పాలు, చేనేత, శ్మశానాల మీద జీఎస్టీ ఎత్తేయాలె

పాలు, చేనేత, శ్మశానాల మీద జీఎస్టీ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ డిమాండ్​ చేశారు. గాలికి తప్ప అన్నింటికీ పన్ను వేశారని దుయ్యబట్టారు. నీతి ఆయోగ్, మోడీ కలిసి రాష్ట్రాల పన్నుల వాటా ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. సెస్ పేరుతో పన్నెండు పదమూడు లక్షల కోట్లను రాష్ట్రాలకు ఎగ్గొట్టారని మండిపడ్డారు. ‘‘పబ్లిక్ సంస్థలు తీసుకునే అప్పులను కూడా, ప్రభుత్వ అప్పులుగా పరిగణిస్తున్నరు. తెలంగాణకు ఉన్న రూ.53 వేల కోట్ల పరిమితిలో, 25 వేల కోట్లకు కోత విధించిన్రు. మేం సుప్రీంకోర్టుకు పోతం అని బెదిరిస్తే, దడుసుకుని పది వేల కోట్లు ఇచ్చిన్రు. ఇంకో 15 వేల కోట్లు కోత పెట్టిన్రు. వాటి సంగతీ అడుగుతున్నం. ఎఫ్‌ఆర్​బీఎం మీద పెట్టిన ఆంక్షలతో అభివృద్ధి కుంటుపడుతది” అని అన్నారు.  

మోడీతో పర్సనల్​గా విరోధం లేదు 

మోడీ తనకు మంచి మిత్రుడని, ఆయనతో తనకు పర్సనల్‌గా విరోధం ఏమీ లేదని కేసీఆర్ చెప్పారు. కానీ, మోడీ చేసే పనులు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నందున ప్రజల కోసం ఆయన మీద పోరాడుతానని తెలిపారు. ‘‘నేను బతికున్నంత వరకూ పోరాడుత.. అది నా ప్రాథమిక హక్కు, బాధ్యత.. భవిష్యత్‌లో పెద్ద ఉద్యమాలకు శ్రీకారం చుడుతం.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలిసి వచ్చే వారందరితో బలమైన ఉద్యమాలు చేపడుతం. నన్ను పిచ్చి పిచ్చి తిట్టి పోదమంటే  కుదరదు.. నా మాటలన్నీ రికార్డు అవుతున్నయి.. ఉట్టిగనే పోవు’’ అని అన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్​ను బహిష్కరిస్తున్నట్లు మోడీకి రాసిన లేఖను మీడియాకు కేసీఆర్​ విడుదల చేశారు. 

15 నుంచి కొత్త పెన్షన్లు

57 ఏండ్లు నిండినోళ్లందరికీ పెన్షన్ ఇస్తామని కేసీఆర్​ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, కొత్తగా మరో పది లక్షల మంది యాడ్ అవబోతున్నారని తెలిపారు. పాత పెన్షన్​ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వబోతున్నామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు కూడా రూ. 2,016 చొప్పున పెన్షన్ ఇస్తామని, వాళ్లు ఒక 12 వేల మంది ఉంటారని పేర్కొన్నారు. ఆగస్ట్ 15 నుంచే కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని, సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. అనాథ పిల్లలను స్టేట్‌ చిల్ట్రన్‌గా డిక్లేర్ చేయబోతున్నామని, అనాథ శరణాలయంలో ఉండే పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని సీఎం తెలిపారు. 

జయశంకర్​ సార్.. ఆశించినట్టే అభివృద్ధి : కేసీఆర్​

జయశంకర్​ సార్.. ఆశించినట్టుగానే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రొ. జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి శనివారం ప్రగతి భవన్ లో కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ‘‘ సార్ ఆశించినట్లుగానే స్వయంపాలనలో.. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, జయశంకర్ కలను సాకారం చేస్తున్నది”అని అన్నారు.