వాసాలమర్రికి రూ.100 కోట్లు.. గ్రామాన్ని దత్తత తీసుకున్నకేసీఆర్

వాసాలమర్రికి రూ.100 కోట్లు.. గ్రామాన్ని దత్తత తీసుకున్నకేసీఆర్
  • ఎర్రవెల్లి ఫాంహౌస్​-యాదాద్రి రోడ్డు విస్తరణలో నష్టపోతున్న గ్రామానికి కేసీఆర్​ హామీ
  • సీఎం ఈ రూట్​లో వెళ్లినప్పుడల్లా నిరసన తెలిపిన ఊరి జనం
  • తాజాగా ఫాంహౌస్​కు పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్
  • గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటన

యాదాద్రి, వెలుగు: సీఎం కేసీఆర్​ ఫాంహౌస్​​ ఉన్న ఎర్రవెల్లి నుంచి యాదాద్రి వెళ్లే రూట్​లో ఉన్న వాసాలమర్రి గ్రామాన్ని రూ.100 కోట్లతో అన్ని విధాలా డెవలప్​ చేస్తానని సీఎం కేసీఆర్​ప్రకటించారు. అంకాపూర్, ఎర్రవల్లి, చింతమడక ఊర్ల తరహాలో వాసాలమర్రిని మారుస్తామని.. ఊర్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం వంద కోట్లే కాదు.. అవసరమైతే ఇంకా ఎన్ని కోట్లయినా సరే ఖర్చుపెడతామని చెప్పారు. నెల రోజుల్లోనే వాసాలమర్రి ఊరి రూపురేఖలు మారిపోతాయన్నారు. ఎర్రవెల్లి–-యాదాద్రి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తుండడంతో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో చాలా మంది భూములు, ఇండ్లు కోల్పోతున్నారు. సీఎం కేసీఆర్ ఈ రూట్​లో వెళ్లినప్పుడల్లా ఊరి జనం ఆందోళన చేస్తూ వస్తున్నారు. తాజాగా శనివారం కూడా సీఎం ప్రయాణిస్తుండగా నిరసన తెలిపారు.

శనివారం నిరసన.. ఆదివారం పిలుపు

జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభం కోసం సీఎం కేసీఆర్  శనివారం ఈ రూట్​లో వెళ్లారు. ఈ టైంలో టీఆర్ఎస్​ ఎంపీటీసీ పలుగుల నవీన్​కుమార్​ ఆధ్వర్యంలో వాసాలమర్రి గ్రామస్తులు రోడ్డు పక్కన నిలబడి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఎంపీటీసీని అదుపులోకి తీసుకుని, ఊరివాళ్లను పంపేశారు. అయితే.. సీఎం కేసీఆర్​ కొడకండ్ల నుంచి తిరిగివస్తూ.. ముల్కలపల్లి, వాసాలమర్రి గ్రామాల్లో కొద్దిసేపు ఆగి ఊరివాళ్లతో మాట్లాడారు. రోడ్డు విస్తరణలో ఇండ్లు, భూములతోపాటు తమ ఊరి స్కూల్, గుడి కూడా పోతున్నాయని వాసాలమర్రి సర్పంచ్​ పోగుల ఆంజనేయులు సీఎం కేసీఆర్​కు చెప్పారు. దీంతో కేసీఆర్​ ఆదివారం వాసాలమర్రి పంచాయతీ పాలకవర్గాన్ని ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్​​కు పిలిపించుకున్నారు.

ఊరి దత్తత.. స్పెషలాఫీసర్​ నియామకం

పొద్దున 10.30 గంటలకు వాసాలమర్రి సర్పంచ్, పంచాయతీ మెంబర్లు ఫాంహౌస్​ కు వచ్చారు. వారితో కేసీఆర్​ రెండు గంటలు మాట్లాడారు. వారి ముందే జిల్లా ఆఫీసర్లకు ఫోన్ ​చేసి ఊర్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వాసాలమర్రినిదత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని యాదాద్రి జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్, ఆఫీసర్లకు తెలిపారు. ఆ ఊరికి స్పెషలాఫీసర్​గా డీఆర్డీవో పీడీ ఉపేందర్​రెడ్డిని నియమించారు. ఊరి డెవలప్​మెంట్​ కోసం రూ.100 కోట్లు మంజూరు చేయిస్తానని, అవసరమైతే ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానని పంచాయతీ మెంబర్లకు కేసీఆర్​ చెప్పారు. ‘‘గ్రామానికి కలెక్టర్​ వస్తరు.. ఆఫీసర్లు వస్తరు.. ఊరికి ఏమేం కావాలో 10 రోజుల్లో ప్రణాళిక రూపొందిస్తరు. అంతకుముందు మీ ఊరిలోని ఓ 400 మంది అంకాపూర్ వెళ్లి రండి. అక్కడి అభివృద్ధిని పరిశీలించండి. అక్కడిలాగే ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలె..’’ అని పేర్కొన్నారు.

నెల రోజుల్లో ఊరు మారుతది

నెల రోజుల్లో వాసాలమర్రి మారిపోతదని సీఎం  చెప్పారని పంచాయతీ మెంబర్లు తెలిపారు. ‘‘ఊరం తా సీసీ రోడ్లు వేయిస్తం. డ్రైనేజీలు కట్టిస్తం. ఊర్లోని యూత్​కు ఉపాధి కల్పిస్తం. వరి కోత మెషీన్లు, ఆటోలు, పాడి పశువులు ఏదంటే అది ఇస్తం. ఊరిలో అందరికీ హెల్త్​ కార్డులు అందిస్తం. మూడ్రోజుల్లో యశోదా హాస్పిటల్​ డాక్టర్లు మీ ఊరికొచ్చి టెస్టులు చేస్తరు. ప్రతి ఒక్కరికి హెల్త్​ రిపోర్ట్​ అందిస్తరు. ఊర్లో భూమిలేని వారిలో అర్హులైన వాళ్లకు 100 ఎకరాలు పంపిణీ చేస్తం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టిస్తం. ఊరిలోని మైసనికుంటను సిద్దిపేటలోని కోమటిచెరువులా డెవలప్​చేస్తం’’ అని సీఎం హామీ ఇచ్చారని మీడియాకు వివరించారు.

ఒక్క ఊరికి సీఎంఇచ్చిన హామీలివీ..

  • ఊరంతా సీసీ రోడ్లు, డ్రైనేజీలు
  • ఇండ్లు లేనోళ్లందరికీ డబుల్​ బెడ్రూం ఇండ్లు
  • భూమిలేని వాళ్లకు 100 ఎకరాలు పంపిణీ
  • యూత్​కు వరికోత మెషిన్లు, ఆటోలు, పాడి పశువులు
  • అందరికీ హెల్త్​ కార్డులు.. యశోదా హాస్పిటల్​ డాక్టర్లతో టెస్టులు
  • సిద్దిపేట కోమటి చెరువులా ఊరిలోని కుంట అభివృద్ధి

వాసాలమర్రి డెవలప్​మెంట్​కు యాక్షన్ ప్లాన్: కలెక్టర్

వాసాలమర్రి డెవలప్​మెంట్​కు యాక్షన్​ప్లాన్​ రూపొందిస్తమని యాదాద్రి కలెక్టర్​ అనితా రామచం ద్రన్​ తెలిపారు. ఊరివాళ్లు సీఎం ఫాంహౌజ్​కు వెళ్లొచ్చిన కాసేపటికే ఆమె గ్రామానికి వెళ్లారు. ఊరం తా చూసి పంచాయతీ ఆవరణలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఊర్లో సమస్యలను గుర్తించేందుకు సర్వే చేస్తామని, పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఎవరేం పని చేయాలను కుంటరో తెలుసుకుని ఉపాధి కల్పిస్తామన్నారు. నిజామాబాద్​ జిల్లా అంకాపూర్​ను పరిశీలించేందుకు వచ్చే వారి లిస్టు ఇవ్వాలని సర్పంచ్ కు సూచించారు.