ఐడియా అదిరింది గురూజీ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో.. రోజూ కొబ్బరి లడ్డు అందిస్తున్న హెడ్ మాస్టర్

ఐడియా అదిరింది గురూజీ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో.. రోజూ కొబ్బరి లడ్డు అందిస్తున్న హెడ్ మాస్టర్

ఉపాధ్యాయ వృత్తి అంటే రోజూ పిల్లలకు పాఠాలు చెప్పామా.. మన పని అయిపోయిందా.. అని మొక్కుబడిగా చేసే ఉద్యోగం కాదు. పిల్లలకు అన్నీ తామై.. చదువు, ఆరోగ్యం, ఆహారం.. ఇలా అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాదిరిగా జాగ్రత్త తీసుకోవడం. అలాంటి వారినే ఉత్తమ ఉపాధ్యాయులు అంటారు. అలాంటి టీచరే ఈయన.. ప్రభుత్వానికి కూడా రాని ఆలోచనతో పిల్లల చదువుతోపాటు పోషకాహారానికి సంబంధించి జాగ్రత్త తీసుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. 

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ కు వచ్చిన ఆలోచనను చూసి.. ఐడియా సూపర్ గురూజీ అంటున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన మధ్యాహ్న భోజనం పథకం అందిస్తూనే.. పిల్లల్లో వచ్చే పోషకాహార లోపాన్ని నివారించాలని అనుకున్నారు. అందుకోసం ప్రభుత్వం పై ఆధారపడటం కాకుండా.. తనకు వచ్చిన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసి చూపించారు. 

ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనంతో పాటు రోజూ ఒక కొబ్బరి లడ్డూను విద్యార్థులకు అందిస్తున్నారు. అలాగని లడ్డూలను ఏ స్వీట్ షాపు నుంచో.. కిరాణ కొట్టు నుంచో కొనటం లేదు. మధ్యాహ్న భోజన కార్మికులతో స్వయంగా తయారు చేయించి వేడి వేడి లడ్డూలను పిల్లలకు అందిస్తున్నారు. 

►ALSO READ | డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన దేవ్ జీ.. ఇంకా అజ్ఞాతంలో 11 మంది మావోయిస్టులు

లడ్డూ తయారు చేసేందుకు కావాల్సిన కొబ్బరిని రామగుండం ఏరియాల్లో ఉండే ప్రముఖ ఆలయాల నుంచి తెప్పిస్తున్నారు. లడ్డూకు కావాల్సిన బెల్లం, యాలకులను హెడ్ మాస్టర్ స్వయంగా తీసుకొచ్చి ఇస్తారు. మొత్తంగా లడ్డూను సొంత ఖర్చులతో పిల్లలకు అందిస్తున్నారు ఈ హెడ్ మాస్టర్. స్కూల్లో స్వచ్ఛమైన పదార్థాలతో స్వయంగా తయారు చేసే లడ్డూ ఘుమఘుమలు గ్రామంలోని చుట్టు పక్కల ఉండే గ్రామస్తులను కూడా ఆకర్శిస్తాయట. లడ్డూ అందించడంతో పిల్లలు భోజనం చేయడంతో పాటు ఇష్టంగా కొబ్బరి లడ్డూను ఆరగిస్తున్నారని హెడ్ మాస్టర్ చెబుతున్నారు. 

కొబ్బరి, బెల్లం ఆలస్యమై.. లడ్డూను తయారీ చేయలేని రోజున.. దాతలు, గ్రామస్తుల సహకారంతో పిల్లలకు అరటి పండ్లు అందిస్తామని తెలిపారు. ఏదేమైనా.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు హెడ్ మాస్టర్ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వం కూడా ఇలాంటి పోషకాహార లడ్డూలను అన్ని స్కూళ్లలో అందించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని గ్రామస్తులు, దాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.