
తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు లేరని సీఎం కేసీఆర్ అన్నారు. శాసనమండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చాక భూముల రేట్లు అద్భుతంగా పెరిగాయని, ఎక్కడో రిమోట్ ఏరియాలో తప్ప ఎకరం రూ.10 లక్షలకు కూడా దొరకట్లేదన్నారు. భూముల రేట్లు పెరగడంతో లాండ్ మాఫియా కూడా పెరిగిందన్నారు.మోడీ సర్కారు తెలంగాణలోని కొన్ని మండలాలు లాక్కొని ఆంధ్రాకి ఇచ్చేసిందని.. సీలేరు కూడా ఇచ్చేసి తెలంగాణకు శాశ్వత నష్టాన్ని చేసిందన్నారు.
రాష్ట్రంలో భూస్వాములు లేనేలేరని, రాష్ట్రంలో 98 శాతం మంది పది ఎకరాల లోపు ఉన్న వాళ్లేనని అన్నారు సీఎం కేసీఆర్. మిగిలిన వారందరికీ న్యాయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. 95 శాతం భూములు ఎస్సీఎస్టీ బీసీలు, మైనారిటీల దగ్గరే ఉన్నాయని, ఏ ఒక్క పాత కులాల దగ్గర లేవని, 25 వేల ఎకరాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారమే లేదన్నారు కేసీఆర్. ఒక్క రూపాయి లంచం ఇచ్చే పనిలేకుండా భూముల మ్యుటేషన్ అయిపోతుందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఇకపై తహసీల్దార్లు కూడా అవినీతికి పాల్పడే అవకాశమే లేదన్నారు. ధరణి పోర్టల్‌లో మార్పులకు తహసీల్దార్‌కు అవకాశం లేదన్నారు. సబ్ రిజిస్ర్టార్లకు ఎలాంటి విచక్షణా అధికారం లేదన్నారు.
పది నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో అప్‌డేట్ కాగానే సంబంధిత కాపీలు వస్తాయన్నారు. రిజిస్ర్టేషన్, మ్యుటేషన్, అప్‌డేషన్ కాపీలు వెంటనే వస్తాయన్నారు. బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫోటోతో రిజిస్ర్టేషన్లు చేస్తామన్నారు. ఈ వివరాలన్నీ లేకుండా తహసీల్దార్లకు పోర్టల్ తెరుచుకోదు. పకడ్బందీ వ్యూహంతో పేద రైతుల హక్కులు కాపాడుతామన్నారు. రైతులు, ప్రజలకు లంచాలు ఇచ్చే బాధ తప్పాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు