
TSRTC ఉద్యోగుల సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం అనైతికం అన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి. అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా RTC ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు RTC సమ్మెకు మద్దతు ఇవ్వడం కరెక్ట్ కానే కాదన్నారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పార్టీలకు ప్రజల మద్దతు లేదన్నారు కేసీఆర్. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదన్నారు.
రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ అనే విధంగా ఉందనీ.. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయనీ.. ఎన్నటికీ వారి ఆశ ఫలించదని కేసీఆర్ అన్నారు.
సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి చీత్కారాలు తప్పవన్నారు సీఎం. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంభించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారని అన్నారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుందన్నారు. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని అన్నారు కేసీఆర్. ప్రజలు ఈ విషయాన్ని గమిస్తున్నారని చెప్పారు ముఖ్యమంత్రి.