
హైదరాబాద్: సీఎం కేసీఆర్.. అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. ఎటువంటి షెడ్యూల్ లేకుండా.. బేగంపేట్ నుంచి హస్తినకు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు కేసీఆర్. సీఎం వెంట.. సీఎస్ సోమేష్ కుమార్, ఎంపీలు సంతోష్, రంజిత్ రెడ్డి, LB నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెళ్లారు. అయితే.. ముందస్తుగా ఎటువంటి అధికారిక ప్రకటనలేకుండా.. హడావుడిగా ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. సీఎం టూర్ తో.. బేగంపేట్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో బేగంపేట్ లైఫ్ స్టైల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. 20నిమిషాల పాటు ట్రాఫిక్ ఆపడంతో.. వాహనదారులతో పాటు.. అంబులెన్స్ లో వెళ్లే వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు. ఢిల్లీలోనే రెండు మూడ్రోజులు ఉండనున్నన్న కేసీఆర్.. జాతీయ స్థాయి నాయకులను కలువనున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాలపై వారితో మాట్లాడనున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు సీఎం కేసఆర్.