తన చుట్టే తెలంగాణ..సీఎం స్పీచ్ లో తొలిదశకు ప్రాధాన్యం కరువు

తన చుట్టే తెలంగాణ..సీఎం స్పీచ్ లో తొలిదశకు ప్రాధాన్యం కరువు

1969లో మొదలైన తొలిదశ తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది. దారుణమైన అణిచివేతకు గురైంది. 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ వాదానికి మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినా కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదు.. ఆ తర్వాత ఉద్యమాన్ని రగిలించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా నాయకత్వం మీద విశ్వాసం కలుగకపోవడం వల్ల, సమైక్యపాలకుల కుట్రల వల్ల ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకు నీరవ నిశబ్దం రాజ్యమేలింది.. ఇంకెక్కడి తెలంగాణ అనే నిర్వేదం జనంలో ఆవహించింది. దాన్ని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. దానికి నాయకత్వం వహించే చారిత్రక పాత్ర నాకు లభించడం వల్ల నాజీవితం ధన్యమైంది. 
– తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన.. ఇది కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడే తొలిపలుకు. చివరకు దశాబ్ది ఉత్సవాల్లోనూ దానినే కొనసాగించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సెక్రటేరియట్ వేదికగా జరిగిన కార్యక్రమంలో సీఎం స్పీచ్ అంతా తన చుట్టే తిప్పుకున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ ప్లాంట్ లో ఆంధ్రోళ్లకు ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తున్నారని నిరసిస్తూ మొదలైన ఆందోళననూ సీఎం ప్రస్తావించలేదు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటం ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటలో జరిగిన కాల్పుల్లో శంకర్ ప్రాణాలు కోల్పోయిన ఘట్టాన్ని గానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆ తర్వాత జరిగిన ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ అంశాన్నీ కేసీఆర్ ప్రస్తావించలేదు. పొడిపొడిగా 1969 ఉద్యమాన్ని, 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితికి 14 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయగా 10 ఎంపీలను గెలుచుకుంది. ఆ విషయాన్ని కూడా అలా దాటవేసేశారు. మలిదశ పోరాటంలో అసువులు బాసిన శ్రీకాంతా చారి పేరునూ ప్రస్తావించకపోగా 1971 తర్వాత చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకునేందుకు ప్రయత్నించినా ప్రజలు విశ్వసించలేదన్నారు. కుట్రల కారణంగా ఉద్యమం ముందుకు సాగలేదని చెబుతూనే.. 2001కి వెళ్లిపోయారు. తెలంగాణ నిర్వేదంలో ఉన్న సమయంలో 2001లో మలిదశ ఉద్యమం మొదలైందని చెప్పారు. వివేకం పునాదిగా, శాంతియుత పంథాలో వ్యూహాత్మకంగా సాగిన ఉద్యమంలోకి అన్ని వర్గాలు వచ్చి చేరాయని పేర్కొన్నారు. దానికి నాయకత్వం వహించే చారిత్రక పాత్ర తనకు లభించిందని చెప్పారు. పోరాటాల ఫలితంగా 2014లో తెలంగాణ ఏర్పాటైందని, తాము అధికారంలోకి వచ్చిన్పటి నుంచి రాష్ట్రాన్ని ప్రగతిపథాన నడుపుతున్నామంటూ అభివృద్ధి మంత్రాన్ని జపించారు. 

పోరాట స్ఫూర్తిని చెప్పలే 

సబ్బండ వర్ణాల పోరాటంతో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక్కో ఘట్టం ఒక్కో పుస్తకం. గైర్ ముల్కీ ఉద్యమం నుంచి మలిదశ పోరులో కీలక పాత్ర పోషించిన 14ఎఫ్​ ఉత్తర్వుల వరకు ఏ అంశాన్నీ కేసీఆర్ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎన్టీరామారావు హయాంలో జారీ అయిన 610 జీవో అంశాన్ని, దానిని తూతూ మంత్రంగా అమలు చేసిన విషయాలను ప్రస్తావించలేదు. చివరకు డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనను కూడా వివరించలేదు. 

ఓట్లు రావని భయమా..?

రాబోయే ఐదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు తెలంగాణ అస్తిత్వమే ఎజెండా ఏర్పాటైన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. అన్ని రాష్ట్రాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కార్యాలయాలను కూడా ప్రారంభించింది. ఏపీలోనూ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది. తెలంగాణలోని పలు సెగ్మెంట్లలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి  ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఈ విషయాలు ప్రస్తావించడం వల్ల ఓట్లు కోల్పోతామని భావించే వెనుకడుగు వేశారా..? అనే చర్చ మొదలైంది. ఘనంగా 20 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ అసలు విషయాలను అటకెక్కించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగిని తొలగించిన సంస్థ