హాస్టళ్ల సమస్యలపై మాట్లాడని సీఎం

హాస్టళ్ల సమస్యలపై మాట్లాడని సీఎం

హైదరాబాద్: ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని హాస్టళ్ల దుస్థితిపై స్పందించలేదు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుపైనే సీఎం ఫోకస్ చేశారు తప్ప గురుకుల పాఠశాలల విద్యార్థుల సమస్యలపై ఏమాత్రం మాట్లాడలేదు. ఓ వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విద్యార్థుల సమస్యలను పట్టించుకోవాలని కేసీఆర్ ను కోరినా సీఎం మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. విద్యార్థులు, విద్యా వ్యవస్థపై కేసీఆర్ కు ఏమాత్రం పట్టింపులేదని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 
 
ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఆహారంలో కప్పలు, పురుగులు రావడం వంటి ఘటనలు సంక్షేమ హాస్టళ్లలో కామన్ గా మారాయి. దీంతో పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు.  అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఇటీవల కామారెడ్డి జిల్ల బీర్కూర్ బీసీ హాస్టల్ లో సాయిరాజు (10) అనే విద్యార్థి పాము కాటుకు గురై చనిపోయాడు. అలాగే అంతకుముందు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు తినే ఆహారంలో బల్లి పడి ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే బాసర ట్రిపుల్ ఐటీలో రోజుల తరబడి విద్యార్థులు తమ సమస్యల పరిష్కరానికి ఉద్యమించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.  కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 గురుకుల సంక్షేమ వసతి గృహాలు ఉండగా వాటిల్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పేద విద్యార్థులు భాగమై ఉన్న సంక్షేమ హాస్టళ్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదని విమర్శలు వస్తున్నాయి.