బిడ్డా.. మీ అవినీతి బయటపెడ్త

బిడ్డా.. మీ అవినీతి బయటపెడ్త
  • దేశమంతా ప్రచారం చేస్త.. 
  • రెండో రోజూ కేంద్రంపై కేసీఆర్​ ఫైర్​
  • నేను మాట్లాడితే బీజేపోళ్లకు లాగులు తడుస్తున్నయ్​
  • రాహుల్​గాంధీని పట్టుకొని అస్సాం సీఎం అట్లంటడా?
  • దేశంలో మత పిచ్చి లేపుతున్నరని ఆరోపణ

యాదాద్రి, వెలుగు: సీఎం కేసీఆర్​ వరుసగా రెండోరోజూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్​ చేస్తూ మాట్లాడారు. శుక్రవారం జనగామ సభలో ‘‘ఢిల్లీ కోట బద్దలు కొడ్త. మోడీని దేశం నుంచి తరిమేస్తం’’ అని హెచ్చరించిన ఆయన..శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన సభలోనూ విమర్శలు, ఆరోపణలు చేశారు. ‘‘కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా ఈ మధ్యనే నా దగ్గరికి వచ్చింది. బిడ్డా.. మీ అవినీతి చిట్టా బయటపెడ్త” అని హెచ్చరించారు. ‘‘కేసీఆర్​ బయలెల్లితే యాందాకైనా పోతడని బీజేపోళ్లకు భయంపట్టుకుంది. వీళ్ల సంగతి దేశమంతా అన్నీ భాషల్లో చెప్త” అని వార్నింగ్​ ఇచ్చారు. తనతో బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్​ థాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్​ మాట్లాడారని చెప్పారు.  మోడీ సర్కారును,  మోడీని తరిమి తరిమి కొట్టాలని, ప్రగతిశీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నడుం కట్టాలని అన్నారు. కడుపుకట్టుకొని, అవినీతి లేకుండా రాష్ట్రంలో పనిచేస్తున్నామని కేసీఆర్‌‌ తెలిపారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణకు కేంద్రం సహకరించలేదని, ఏకాణా ఇవ్వకున్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రెసిడెన్షియల్​ సూట్స్​, భువనగిరిలో కలెక్టరేట్​, టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసును కేసీఆర్​ ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన  మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తెలంగాణతో గోక్కుంటున్నారని దుయ్యబట్టారు. 

నాకేం లాలూచీ లేదు
‘‘పార్లమెంట్ల ఏం మాట్లాడతడు మోడీ? ఎందుకు గోక్కుంటున్నవ్ తెలంగాణతోని? మనం మేలుకొనకపోతే చాలా ప్రమాదంలో పడ్తం. అందరం కలిసి కొట్లాడాలె. నేను మాట్లాడంగనే బీజేపోళ్లకు లాగులు తడిసి ఏదో మాట్లాడుతున్నరు. నేను నీటిసుక్కనే అయితే ఎందుకు గడగడ అయితున్నరు?” అని  కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘మీ కేంద్రం అవినీతి బాగోతాల చిట్టా.. ఈ మధ్యనే నా చేతికి వచ్చింది. కేంద్రానికి ఎదురుతిరిగే మొనగాడు ఎవరా..? అని ఎదురుచూసినోళ్లు మొత్తం చిట్టా నాకు పంపిన్రు. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నయ్. కేంద్ర మంత్రులకు సంబంధించిన అవినీతి పద్దులు పద్దులుగా నాచేతికి వచ్చింది. నాకేం లాలూచీ లేదు కదా.. గట్టిగనే మాట్లాడతా. నా బతుకు నేను బతుకుదామనుకున్న.. నా రాష్ట్రం నాకు ముఖ్యం.. నా బతుకు తెలంగాణ. నేను చచ్చినా సరే కరెంటు పాలసీ అమలు చేయ” అని అన్నారు. 

మోడీ సర్కారుకు పిచ్చిపట్టింది
‘‘నరేంద్ర మోడీ సర్కారుకు పిచ్చి ముదురుతున్నది. పిచ్చి ముదిరి పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తున్నరు. వ్యవసాయ చట్టాలు తెచ్చిన్రు. ఒక యాడాది పాటు రైతులను ఏడిపించిన్రు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తే ప్రజలకు భయపడి ఆ చట్టాలు వాపస్​ తీసుకొని.. ప్రధాని స్వయంగా క్షమాపణ చెప్పిన్రు” అని కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పిచ్చెక్కి రైతులతో పెట్టుకుంటున్నరు.. విద్యుత్​ సంస్కరణలను ఒప్పుకుందామా. కరెంట్​ ఫ్రీగా ఇచ్చుకుందామా? ఫ్రీగా కరెంటు ఇయ్యాల్నంటే.. మోడీని తరిమి తిరిమి కొట్టాలి” అని అన్నారు.
మతపిచ్చి లేపుతున్నరు. సిలికాన్ వ్యాలీ బెంగళూరులో మతపిచ్చి లేపి కశ్మీర్ వ్యాలీలా మార్చుతున్నారని కేసీఆర్​ ఆరోపించారు. ‘‘ఎవరు అవునన్నా కాదన్నా.. ఐటీ రంగంలో భారతదేశానికే సిలికాన్ వ్యాలీ బెంగళూరు సిటీ.. అది కర్నాటకలో ఉన్నది. దాని తర్వాత రెండో స్థానంలో ఉన్నది మన హైదరాబాద్ సిటీ. కర్నాటకలో ఏం జరుగుతున్నది మీకు తెలుసు కదా. ఆడపిల్లల మీద.. మన బిడ్డల మీద.. పసికూనల మీద రాక్షసుల్లా ప్రవర్తించవచ్చునా?’’ అని మండిపడ్డారు. ‘‘ఈ దేశం నాశనమైతే ఎవరు పెట్టుబడి పెడతరు. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తయ్​.. ఈ తెలివి తక్కువ బీజేపీ పాలనలో ఇప్పటికే నష్టపోయినం. ఇది నా లెక్క కాదు. కుక్కల్లా ఎక్కడ పడితే అక్కడ అరవడం కాదు. దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరిగింది నిజం కాదా?  దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోవడం నిజం కాదా? మోడీ.. ఇదేనా మీ ఉజ్వలమైన పాలన?  పొద్దున లేస్తే దేశంలో కర్ఫ్యూలు, లాఠీ చార్జీలు.. ఇదేనా దేశానికి కావాల్సింది. అమెరికాలో 95 శాతం క్రిస్టియన్లు ఉంటారు.. కానీ.. వాళ్లు ఏనాడూ మతపిచ్చి లేపరు. అందుకే అమెరికా ప్రపంచాన్ని శాసిస్తున్నది” అని అన్నారు. ‘‘నీ తెలివితక్కువ లాక్ డౌన్ నిర్ణయం వల్ల అనేకమంది రోడ్ల మీద నడిచిన్రు” అని మోడీపై మండిపడ్డారు. 

అస్సాం సీఎంను బర్తరఫ్​ చేయాలి
‘‘కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీని అస్సాం సీఎం.. నువ్వు ఏ అయ్యకు పుట్టినవో అడిగినమా? అని ప్రశ్నించిండు. ఇటువంటి మాట అనొచ్చునా? బీజేపీ సంస్కారం ఇదేనా? మన హిందూ ధర్మం ఇదేనా? మన దేశం మర్యాద ఇదేనా? ఒక నేతను పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నరు? సీఎం అట్లా మాట్లాడవచ్చునా?” అని కేసీఆర్​ ప్రశ్నించారు. అస్సాం సీఎంను బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘రాహుల్ అనే ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనతో నాకు సంబంధం లేదు. కానీ, వాళ్ల నాయనమ్మ, నాయిన ఈ దేశం కోసం చనిపోయారు. వాళ్ల తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక ఏండ్లు ప్రధానమంత్రిగా పని చేసిన్రు. ఇవాళ రాహుల్ గాంధీ పిలగాడు ఎంపీగా ఉన్నడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతం. చర్చ జరుగుతది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అడుగుతరు. ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతరు. రాహుల్ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ సీఎం ఏం మాట్లాడిండు? ఆయన అన్న మాట వింటే నాకే కండ్లల్ల నీళ్లు తిరిగినయ్. తల దించుకున్నంత పనైంది. ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు రాల్చుకుంటున్నరు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాను నేను అడుగుతున్నా.. ఇదేనా మీ సంస్కారం? వెంటనే అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్  చెయ్యండి” అని అన్నారు. 

కేంద్రం అప్పులు ఆకాశాన్నంటుతున్నయ్​
‘‘ఓపికకు కూడా హద్దులు ఉంటయ్​. బీజేపీకి ఎందుకంత అహంకారం. తమాషా చేస్తున్నరా? దేశం నాశనమైతే ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చుంటరా? దేశం ఎవడయ్య సొత్త కాదు. ధర్మాన్ని, నిజాన్ని కాపాడటం కోసం.. న్యాయం పక్షాన నిలబడటానికి తెలంగాణ రాష్ట్రం పులిలా ఎప్పుడూ రెడీగా ఉంటది. ఎవరికి అన్యాయం జరిగినా.. సహించది. అది తెలంగాణ గడ్డలో, తెలంగాణ రక్తంలో ఉన్న పౌరుషం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో ఈ మతపిచ్చి ప్రభుత్వం ఉండొద్దు.  ప్రగతికాముక ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం ఏర్పాటు కోసం ముందుకు పోదాం” అని కేసీఆర్​ అన్నారు. ‘‘మత పిచ్చి బీజేపీ ప్రభుత్వం మనకు పనికిరాదు. అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్. ఎనిమిదేండ్లలో ఏ పనీ చేయలేదు. ఏ రంగంలో అభివృద్ది లేదు. జీడీపీ పతనమైంది. ఆరోగ్య సూచీలు దెబ్బతిన్నయ్​? అప్పులు ఆకాశాన్నంటుతున్నయ్​. డంబాచారం తప్పితే ఇంకేం లేదు. మంది మీద పడి ఏడ్చుడు.. మత పిచ్చి లేపుడు తప్పితే వీళ్లు సాధించింది ఏం లేదు. ఈ దేశానికి పట్టిన దరిద్రం బీజేపీ. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్క మూతి పిందె ఈ బీజేపీ. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. హెచ్చరించడం.. చెప్పడం నా బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.

For more news..

వేలంలో రూ. 10 కోట్లకు పైగా పలికిన ఆటగాళ్లు వీళ్ళే..

యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం