గెలిచిన నెల రోజుల్లో .. రెవెన్యూ డివిజన్

గెలిచిన నెల రోజుల్లో  .. రెవెన్యూ డివిజన్
  • దుబ్బాకలో ఎవరు గెలిస్తే  వారిదే ప్రభుత్వం
  • దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: కొత్త ప్రభాకర్​రెడ్డి గెలిచిన నెల రోజుల్లోనే  దుబ్బాక రెవెన్యూ డివిజన్  ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్​ హామీఇచ్చారు. ఆదివారం ఆయన దుబ్బాక  ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగించారు. దుబ్బాకలో  ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నామని, తాను ప్రచారం చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో  ఇచ్చిన వాగ్ధానాలలో  బీజేపీ ఎమ్మెల్యే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావుపై విమర్శలు చేశారు. వారు చెప్పే జూటా మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు.

కొత్త  ప్రభాకర్​రెడ్డిపై కత్తి దాడి తమకు కోపాన్ని  కలిగించినా అణుచుకున్నామని, భగవంతుని దయ వల్ల ఆయన బయటపడ్డారన్నారు.  కొత్త ప్రభాకర్​రెడ్డి గెలిచిన నెల రోజుల్లో దుబ్బాక రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఆయన కోరినట్లు కాలేజీలు, గుళ్లు బాగు చేయడమే కాకుండా  రోడ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దుబ్బాక తన గడ్డ అని బాగు చేయడం తన కర్తవ్యమని చెప్పారు. మల్లన్న సాగర్ తో నియోజకవర్గంలో 1.75 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయని వాటికి సంబంధించిన కాల్వలను పూర్తి స్తామన్నారు. 
 
ఓట్ల కోసం తప్పుడు ప్రచారాలు: కొత్త ప్రభాకర్ రెడ్డి 

ఓట్ల కోసం ప్రతి పక్షాల అభ్యర్థులు అబద్ధాలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి అన్నారు. గతంలో కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన వ్యక్తికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. పవర్ ప్లాంట్ల కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుంటుందోని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే ఆయన సొంత గడ్డపై ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, పది సంవత్సరాలు ఎంపీగా ఒక్క చిన్న తప్పు చేయ లేదని చెప్పారు.

దుబ్బాక రెవెన్యూ డివిజన్, దుబ్బాక పట్టణం చుట్టూ రింగ్ రో డ్డు, దౌల్తాబాద్, మిరుదొడ్డి, చేగుంటల్లో డిగ్రీ కాలేజీలు,  కొత్త మండలాల్లో ఐఓసీలు, కూడవెల్లి రామలింగేశ్వరాలయం, రేకుల కుంట మల్లికార్జున స్వామి ఆలయాల పునర్ నిర్మాణం,  ఆర్ అండ్ బీ,  పీఆర్ రోడ్ల ను అభివృద్ధి చేయాలని సీఎంను  కోరినట్లు తెలిపారు.

దుబ్బాక పై కేసీఆర్ ది కన్నతల్లి ప్రేమ: మంత్రి హరీశ్​ రావు 

దుబ్బాక పై సీఎం కేసీఆర్​కున్నది  కన్నతల్లి ప్రేమని, బీజేపీ,  కాంగ్రెస్ వాళ్లది సవతి తల్లి ప్రేమని మంత్రి హరీశ్​ రావు అన్నారు. దుబ్బాక ప్రజలు కన్నతల్లి ప్రేమ కావాలా, సవతి తల్లి ప్రేమ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ప్రజలే కార్యకర్తలై,  కార్యకర్తలే లీడర్లై  ప్రభాకరన్నను గెలిపించుకుని దుబ్బాక అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.  ప్రతిపక్ష అభ్యర్థుల  దొంగ మాటలు నమ్మొద్దని కోరారు.  ఎస్పీ ఎస్టీల  అసైన్డ్ భూముల్లో ఒక్క గుంట గుంజుకోబోమని, మీ భూములకు మిమ్మల్నే ఓనర్లు చేసి అమ్ముకునే హక్కును కల్పిస్తామని హామీనిచ్చారు. అబద్ధాల బీజేపీ మాటలు నమ్మి మూడేండ్లు వెనక్కి పోయామని,  మరోసారి అలాంటి తప్పు చేయవద్దని కోరారు.