వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ

వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ

హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో  ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.  భారీ వర్షాల కారణంగా ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు...

రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ముంపు పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి,  ప్రతి ఆరు గంటలకోసారి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లను ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలోని వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ కు సూచించారు. వానల నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్థితులను వెంట వెంటనే సీఎం కార్యాలయానికి తెలియజేయాలన్నారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పోలీస్, వైద్య, విద్యా శాఖలు అప్రమత్తంగా ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలుండే అన్ని శాఖలు నిరంతరం పనిచేసే విధంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైనచోట హెలికాప్టర్ లను వినియోగించి రక్షణ చర్యలను చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి

జీహెచ్ఎంసీ పరిధిలో వరద పరిస్థితులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ తీగలు తెగిపడడం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటి వరద ప్రవాహం ఎక్కువగా ఉండే దారులలో(కాజ్ వేలు)  ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యారేజీలు, పక్క రాష్ట్రాల్లో నిండుతున్న బ్యారేజీల వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంటువ్యాధులు చూడాలన్నారు. విద్యుత్, తాగునీటికి అంతరాయాలు కలుగుకుండా చూసుకోవాలన్నారు. వానలు ఆగినా... కొన్ని రోజుల పాటు వరదలు కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వరదల నుంచి ప్రజలను కాపాడటానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలో వరద పెరిగే అవకాశమున్నందున నీటి విడుదల చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితులు అదుపులోనే అధికారులు సీఎంకు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,  పి.సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎస్.మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, మంచిరెడ్డి కిషన్ రెడ్డి,భేతి సుభాష్ రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. నర్సింగ రావు, సెక్రటరీలు స్మితా సబర్వాల్, వి.శేషాద్రి, రాహూల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు