16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

సికింద్రాబాద్ : శాంతితో విలసిల్లే భారత దేశంలో జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచేలా కొందరు మాట్లాడుతున్న మాటలు వింటుంటే హృదయానికి బాధకలుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు . ‘‘వెకిలి వ్యక్తులు చేసే వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముని ప్రభ తగ్గదు. మరుగుజ్జులు మహాత్ములు కాలేరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ సమాజాన్ని చీల్చేందుకు కొన్ని చిల్లర మల్లర శక్తులు కుట్రలు చేస్తున్నాయి. అయినప్పటికీ గాంధీ చెప్పిన సిద్ధాంతమే శాశ్వతంగా ఉంటుంది. మరుగుజ్జులు మహాత్ములు కాలేరు’’ అని ఆయన పేర్కొన్నారు.  హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ 16 అడుగుల విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 

గాంధీ గురించి ఒబామా చెప్పిన మాటలు.. 

ఈసందర్భంగా గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.  కరోనా టైంలో వసతులున్నా లేకపోయినా ధైర్యంగా సేవలందించిన ఘనత గాంధీ ఆస్పత్రి వైద్యులదని కేసీఆర్ కొనియాడారు. గాంధీ ఇచ్చిన ధైర్యంతో కరోనా మహమ్మారిపై ఇక్కడి వైద్యులు యుద్ధం చేశారని చెప్పారు. ప్రైవేటు హాస్పిటల్స్ కరోనా రోగులను రెజెక్ట్ చేస్తే.. తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన ఘనత గాంధీ ఆస్పత్రి వైద్యులదేనని తెలిపారు. ఫిరంగులు, తుపాకులు, తూటాలున్న  బ్రిటీష్ వాళ్లను అహింసతో ఎదుర్కోవచ్చని ధైర్యంగా ఆనాడు చెప్పిన మహా సాహసి గాంధీ అని చెప్పారు. ‘‘గాంధీ అనే వ్యక్తి భూగోళం మీద పుట్టి ఉండకుంటే.. నేను అమెరికా అధ్యక్షుణ్ని అయ్యేవాణ్ని కాదు’’ అని నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారని కేసీఆర్ గుర్తు చేశారు. 

‘జై జవాన్’ అగ్నిపథ్ లో నలిగిపోతున్నడు

‘జై జవాన్.. జై కిసాన్’ అనే గొప్ప నినాదాన్ని ఇచ్చి, నిరాడంబర జీవితాన్ని గడిపిన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈరోజేనని కేసీఆర్ తెలిపారు. గాంధీ మహాత్ముడితో పాటు లాల్ బహదూర్ శాస్త్రికి కూడా ఇవాళ యావత్ దేశం ఘన నివాళులర్పిస్తోందన్నారు. ‘‘శాస్త్రీజీ ప్రవచించిన ‘జై జవాన్’ అగ్నిపథ్ లో నలిగిపోతున్నాడు.. ‘జై కిసాన్’  మద్దతు ధర అందక కుంగి క్రుశించి, నశించిపోతున్నడు’’ అని కేసీఆర్ కామెంట్ చేశారు. రైతులు, సైనికులు, దేశ ప్రజల ఈ కష్టాలు శాశ్వతం కాదు.. తాత్కాలికమేనన్నారు. ఇక అంతకుముందు సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహానికి పూలు వేసి కేసీఆర్ నివాళుర్పించారు.