కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు జాతికి అంకితం

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు జాతికి అంకితం

కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ప్రాజెక్టు ఇంజినీర్లతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఈ ఉదయం మేడిగడ్డ దగ్గర శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో.. జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహించారు. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించిన వేదపండితులు.. అనంతరం పూజలు చేశారు. వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మహాసంకల్ప యాగం నిర్వహించారు. ఈ యాగంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు వైఎస్ జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

యాగం పూర్తైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఫోటో గ్యాలరీలను అతిథులకు వివరించారు సీఎం కేసీఆర్.  కాళేశ్వరం డాక్యుమెంటరీ చూశారు. తర్వాత  కాళేశ్వరం శిలాఫలకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ దగ్గర గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. ఆతర్వాత సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. బ్యారేజీలో అతిథులంతా పసుపు, కుంకుమ చల్లారు.

ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌజ్ దగ్గరకు సీఎంలు కేసీఆర్, జగన్, గవర్నర్ నరసింహన్ వెళ్లారు. సీఎం కేసీఆర్ ఆరో నంబర్ మోటార్ ను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు.