నల్గొండ జిల్లా అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్

నల్గొండ జిల్లా అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్
  • నాగార్జునసాగర్‌‌‌‌లో పనుల్లో జాప్యంపై అసంతృప్తి
  • వారం రోజుల్లోగా టెండర్లు పిలవాలని ఆదేశాలు
  • నల్గొండ డెవలప్‌‌మెంట్ డిజైన్లు సరిగ్గా లేవన్న కేసీఆర్

నల్గొండ, వెలుగు: ‘‘పైసలిచ్చినా.. పనులెందుకు చెయ్యట్లే? ఎందుకు డిలే చేస్తున్నరు? ఫండ్స్ ఇస్తే ఖర్చు పెట్టుకోకుంటే ఎట్లా?’’ అని నల్గొండ జిల్లా అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ దశదిన కర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. నల్గొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే చిరుమర్తి ఇంట్లో రివ్యూ చేశారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఫండ్స్ ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా పనులెందుకు ప్రారంభించలేదని మండిపడ్డారు. వివిధ రకాల సమస్యల వల్ల టెండర్లు లేట్ అవుతున్నాయని కలెక్టర్ ప్రశాంత్ జీవన్​పాటిల్ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ సంతృప్తి చెందని సీఎం.. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని డెడ్​లైన్ పెట్టారు. నెల్లికల్లు లిఫ్ట్ స్కీం పనులు, ఇతర లిఫ్టుల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

డిజైన్లు మార్చండి.. కొత్తవి తయారు చేయండి

నల్గొండ పట్టణాభివృద్ధికి సంబంధించిన డిజైన్లు బాగాలేవని, వాటిని పూర్తిగా మార్చి కొత్త డిజైన్లు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నల్గొండలో జరుగుతున్న పనుల వివరాలను కేసీఆర్‌‌‌‌కు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఫొటోలతో సహా చూపించగా, వాటిపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కళాభారతి, ఉదయ సముద్రం, వల్లభారావు చెరువుల బ్యూటిఫికేషన్, జంక్షన్ల డిజైన్లు చూడగానే ఆకట్టుకునేలా తీర్చిద్దాలని సూచించారు. పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, త్వరగా పూర్తి చేయాలన్నారు. రీడిజైన్ల కోసం సీఎం అప్పటికప్పుడు ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డికి ఫోన్ చేసి నల్గొండకు రమ్మని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు నల్గొండకు చేరుకున్న వెంకట్రాంరెడ్డి.. కలెక్టర్, ఎమ్మెల్యేతో చర్చించారు. కొత్తగా రెండు, మూడు ఏజెన్సీలతో డిజైన్లు తయారు చేయించాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు వెంకట్రాంరెడ్డితో కలిసి పట్టణంలో పర్యటించారు.

మరిన్ని పనులకు గ్రీన్‌‌ సిగ్నల్

నల్గొండ పట్టణంలో ఆర్అండ్‌‌బీ ఎస్ఈ, ఈఈ ఆఫీసుల కోసం కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో బిల్డింగ్‌‌ నిర్మించాలని, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కోసం ఎస్ఎల్‌‌బీసీ వద్ద కొత్త బిల్డింగ్ నిర్మించాలని ఆఫీసర్లకు సీఎం సూచించారు. క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఆర్అండ్‌‌బీ గెస్ట్ హౌస్‌‌ను కూల్చేసి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆదేశించారు. మర్రిగూడ బైపాస్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్అండ్‌‌బీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌‌కు ఫోన్ చేసి నిర్మాణాలకు సంబంధించిన జీఓలు ఇవ్వాలని సీఎం ఆదేశాలిచ్చారు.

చిరుమర్తి ఫ్యామిలీకి పరామర్శ

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ దశదిన కర్మ కార్యక్రమానికి సీఎంతోపాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నార్కట్​పల్లి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక వద్ద సీఎంతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. తర్వాత చిరుమర్తి నివాసంలో భోజనం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.