
హైదరాబాద్, వెలుగు: జులై నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తామని, అందువల్ల ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల గేట్లు, తూములకు రిపేర్లు చేయించి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాజెక్టులో తొలిసారిగా నీటిని ఎత్తిపోస్తున్నందున ఏవైనా ఇబ్బందులొచ్చే అవకాశముందని, వాటిని సరిదిద్దేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జులైలో నీళ్లు ఎత్తిపోయడం మొదలు పెడ్తం. మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి మీదుగా మిడ్ మానేరుకు.. అక్కడ్నుంచి అటు ఎస్సారెస్పీకి, ఇటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్లను ఎత్తిపోస్తం. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్‌ఎండీ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీళ్లు నింపుతం. ఆ జలాశయాల గేట్లు, తూములు ఎట్లున్నయో పరిశీలించండి. వాటికి అవసరమైన రిపేర్లను 20 రోజుల్లోనే చేయించాలె. ఎప్పుడంటే అప్పుడు గేట్లు ఎత్తి, దించేందుకు రెడీ చేయండి.
వరద కాలువ, కాకతీయ, లక్ష్మి, సరస్వతి, గుత్ప, అలీసాగర్ కాల్వలన్నింటినీ పూర్తి స్థాయి ప్రవాహానికి సిద్ధం చేయండి. కాల్వల తూములు, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు ఎట్లా ఉన్నాయో చూడండి. అవసరమైన కాడ రిపేర్లు చేయించండి. ఇందుకు కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేస్తం. డబ్బులకు కొరత లేదు. నీళ్లు మాత్రం పారాలె. కాలువలపై నీటిని మళ్లించే లష్కర్‌లను వెంటనే నియమించండి. కాళేశ్వరం నీటి తరలింపునకు అవసరమైన విధి విధానాలు ఖరారు చేయండి. ఇందుకోసం ఇంజనీర్లతో వర్క్‌షాప్ నిర్వహించండి..’ అని ఆయన సూచించారు.
ఎప్పటికప్పుడు పరిష్కరించాలె..
మేడిగడ్డ నుంచి ఈ ఏడాదే తొలిసారిగా నీళ్లు ఎత్తిపోస్తున్న నేపథ్యంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశముందని, వాటిని అధిగమించేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. బ్యారేజీల నుంచి రిజర్వాయర్లకు, అక్కడ్నుంచి చెరువులకు నీళ్లను తరలించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. కాల్వల నీళ్లు పొలాలకు చేరేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇన్నాళ్లు కరువుతో ఇబ్బందిపడ్డ తెలంగాణలో ఇకపై నిరంతరం నీటి ప్రవాహం ఉంటుందన్నారు. సమావేశంలో సీఎస్ ఎస్‌కే జోషి, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్, సీఈలు ఖలిందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.