రెండున్నర నెలల్లో యాదాద్రి పూర్తవ్వాలె

రెండున్నర నెలల్లో యాదాద్రి పూర్తవ్వాలె
  • యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్ రివ్యూ

యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆలయం లోపల, బయట అనుబంధంగా జరుగుతున్న పనులను వేగంగా ముగించాలన్నారు. సోమవారం వరంగల్ పర్యటన ముగించుకొని యాదాద్రికి వచ్చిన సీఎం బాలాలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జపాన్​ టెక్నాలజీతో ఆర్భాటంగా వెలిగించిన లైట్లపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. లైటింగ్ కోసం మోడ్రన్ లైట్లు అమర్చాలని చెప్పారు. తర్వాత ఆలయ నిర్మాణంపై రివ్యూ నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ బిల్డింగ్, ఎస్కలేటర్లు, ఆర్నమెంటల్ ఎలివేషన్, లాండ్ స్కేపింగ్, బీటీ రోడ్, కార్ పార్కింగ్ ఇతర పనుల గురించి ఆరా తీశారు. పనులు వేగంగా జరగని చోట వర్కింగ్ ఏజెన్సీలను మార్చాలన్నారు. రింగ్ రోడ్ పరిధిలో ఉన్న భూములపై డీజీపీఎస్ సర్వే నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. రింగ్ రోడ్ లోపల ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఉండాలన్నారు. బస్ డిపో, బస్టాండ్ నిర్మాణానికి వారం రోజుల్లోగా పనులను ప్రారంభించాలని, మూడు నెలల్లోగా పూర్తి కావాలన్నారు.  
కడుపునిండా పరిహారమిస్తం.. 
రివ్యూ తర్వాత రింగ్ రోడ్ పరిధిలో నష్టపోతున్న వారిలో కొందరితో సీఎం మాట్లాడారు. భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కడుపునిండా పరిహారం ఇస్తామని ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీలో షాపుల కేటాయింపులో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు.
యాదాద్రి కొండచుట్టూ గంటసేపు తిరిగిన కేసీఆర్
వరంగల్ ​నుంచి సాయంత్రం ఆరు గంటలకు సీఎం కేసీఆర్ ​యాదాద్రిలోని టెంపుల్​సిటీకి హెలికాప్టర్​లో చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో వచ్చిన ఆయన.. కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రింగ్​రోడ్డును దాదాపు గంటసేపు పరిశీలించారు. కొండచుట్టూ రెండుసార్లు తిరిగారు. గండిచెరువు, కల్యాణకట్ట, పుష్కరిణి, అన్నదానసత్రం, దీక్షాపరుల భవన నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణాన్ని పరిశీలించారు. సీఎం వైకుంఠద్వారం వైపు వెళ్తున్న సమయంలో.. రింగ్​రోడ్డు కారణంగా ఇండ్లు కోల్పోయిన మిట్ట వీరేశం వినతిపత్రం పట్టుకొని రోడ్డు పక్కన నిలబడ్డారు. ఆయనను చూసిన కేసీఆర్​కారు ఆపి, విరేశాన్ని ఎక్కించుకొని వైకుంఠద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ మరో బాధితుడు నర్సింహ వినతిపత్రంతో కనిపించారు. రింగ్​రోడ్డులో ఇండ్లు, షాపులు కోల్పోయిన తామందరికీ.. ముందుగా ప్రెసిడెన్షియల్ సూట్ వద్ద 314 సర్వే నంబర్​లో ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు ఎలాంటి డెవలప్​మెంట్ లేని 329 సర్వే నంబర్​లో ఇస్తామని ఆఫీసర్లు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.