మహారాష్ట్రలో అధికారంలోకొస్తే ఐదేండ్లలో ఇంటింటికీ తాగునీరు

మహారాష్ట్రలో అధికారంలోకొస్తే ఐదేండ్లలో ఇంటింటికీ తాగునీరు

 

  • బంజారాహిల్స్‌‌లో ఇచ్చే నీళ్లనే మారుమూల గూడేలకు ఇస్తున్నం
  • మా దగ్గర నీళ్లు సముద్రంలోకి పోతలే.. పొలాల్లోకి మళ్లిస్తున్నం
  • దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకుంటలేరని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: దేశంలో రైతు రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు అందరూ తనతో కలిసి రావాలని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో తమకు అధికారమిస్తే ఐదేండ్లలోనే ఇంటింటికీ తాగునీరు, ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి మహారాష్ట్ర ఔరంగాబాద్‌‌లోని జంబిదా మైదానంలో నిర్వహించిన బీఆర్​ఎస్​ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘పండ్లు ఇచ్చే చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి. ముళ్లు ఇచ్చే చెట్లు పెట్టి పండ్లు కావాలంటే ఎట్ల వస్తాయి? గాడిదకు గడ్డి వేసి ఆవును పాలియ్యమంటే ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోవాలి. దళితులు, రైతులకు నేను ఒక్కటే చెప్తున్న. ఆత్మహత్య చేసుకోవడం సమాధానం కాదు. ఓటు అనే అస్త్రం మన చేతుల్లోనే ఉంది. ఆ ఓటుతో మన కిస్మత్ మార్చుకోవచ్చు. రైతు రాజ్యం లక్ష్యంగా అందరూ నాతో కలిసి రండి” అని అన్నారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రతి జిల్లా పరిషత్‌‌‌‌పై గులాబీ జెండా ఎగురవేస్తే తెలంగాణ మోడల్ ఇక్కడికి వచ్చి తీరుతుందన్నారు. తాను నాందేడ్‌‌‌‌లో ఒక్క సభ పెడితే రైతుల కోసం ప్రభుత్వం రూ.6,900 కోట్లు కేటాయించిందని చెప్పారు.

మనమే పరిష్కారం చూపించాలె

‘‘మన దేశానికి అసలు లక్ష్యమంటూ ఉన్నదా? అనే ప్రశ్న నన్ను తొలిచేస్తున్నది. దేశం పురోగమిస్తున్నదా, తిరోగమిస్తున్నదా అనేది ఆలోచించాలి. నేను ఇది వరకు నాందేడ్, లోహ బహిరంగ సభల్లో ఏం చెప్పాననేది మరిచిపోవద్దు. అవి దేశానికి మంచి చేస్తాయో లేదో మీ గ్రామాల్లో చర్చించాలి” అని కేసీఆర్ సూచించారు. ‘‘గోదావరి, కృష్ణా సహా మహారాష్ట్రలో ప్రవహించేటన్ని నదులు దేశంలోని ఇంకే రాష్ట్రంలోనూ ప్రవహించడం లేదు. దేశానికి ఆర్థిక రాజధాని అయిన ముంబై ఉన్న రాష్ట్రం.. ప్రజలకు కనీసం తాగు, సాగునీరు ఎందుకు ఇవ్వలేపోతుందో చెప్పాలి. ప్రధాని, సీఎంకు పని చేసే చిత్తశుద్ధి, సామర్థ్యం లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తరు కానీ తాగేందుకు నీళ్లు ఇవ్వరా? ఇలాగే ఉందామా.. మార్పు రావాలని కోరుదామా? దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కోటీశ్వరులు ఒక్క ఏడాదిలోనే వేల కోట్లకు అధిపతులు అవుతున్నారు. పేదలు ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు. ఇవన్నీ ఇలాగే సాగనిద్దామా.. ఎవరికైనా జబ్బు చేస్తే వైద్యుడు బాగు చేస్తడు.. అలాగే దేశానికి జబ్బు చేస్తే బుద్ధిజీవులు, చదువుకున్న యువకులు సరిచేయాలి. యువతదే భవిత.. మీ భవిష్యత్ కోసం మీరే ఆలోచన చేయాలె. దీనికి అమెరికా, రష్యా నుంచి ఎలాంటి పరిష్కారం దొరకదు.. మనమే పరిష్కారం చూపించాలె” అని పిలుపునిచ్చారు.

నీళ్లు, కరెంట్​ఇస్తే చాలు

పార్టీ ఆఫీస్ కోసం నాగపూర్‌‌‌‌‌‌‌‌లో సొంత భవనం కొనుగోలు చేశామని, అద్దె భవనంలో ఆఫీస్ పెట్టలేదని కేసీఆర్ అన్నారు. దేశంలో పరివర్తన వచ్చే వరకు ఆ ఆఫీస్ ఉంటుందని, పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. రైతులతో పాటు అన్ని రంగాలకు నీళ్లు, కరెంట్​ఇస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. ‘‘మన దేశం మొత్తానికి అవసరమైన దానికి రెట్టింపు నీళ్లు ఉన్నాయి. అయినా పాలకులకు చిత్తశుద్ధి లేదు. ప్రజలను ఆదుకోవాలన్న లక్ష్యం వాళ్లకు లేదు. హక్కుగా రావాల్సిన నీళ్లు సముద్రంలోకి పరుగులు పెడుతున్నాయి.. ప్రవహించే నదులను ఆపేయాలి. భారీ డ్యాములు, రిజర్వాయర్లు కట్టాలె. ఇక్కడ ఉన్న జైక్వాడీ రిజర్వాయర్​ కన్నా వందలు వేల రెట్లు పెద్దదైన డ్యాం జింబాబ్వే అనే చిన్న దేశంలో ఉన్నది. దేశంలో ఇప్పుడున్న వాటర్​ పాలసీని మార్చి కొత్తది తీసుకురావడమే మా లక్ష్యం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఐదేండ్లలోనే ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటిని ఇస్తామని హామీ ఇస్తున్న. హైదరాబాద్‌‌‌‌లో సంపన్నులు నివసించే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌‌‌‌లో ఇచ్చే నీళ్లనే ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గూడేనికి ఇస్తున్నాం. మా దగ్గర నీళ్లు సముద్రంలోకి పరుగులు పెట్టడం లేదు.. మా పొలాల్లోకి మళ్లిస్తున్నాం” అని వివరించారు.

సోమేశ్ కుమార్.. స్పెషల్ అట్రాక్షన్

ఔరంగాబాద్ ​సభలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచారు. హైకోర్టు తీర్పు, డీవోపీటీ ఆదేశాలతో ఏపీ క్యాడర్‌‌‌‌‌‌‌‌లో జాయిన్​అయిన ఆయన.. తర్వాత వాలంటరీ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌కు అప్లయ్ చేసుకున్నారు. కొన్నాళ్లుగా ఎక్కడా కనిపించని సోమేశ్.. సోమవారం కేసీఆర్ వెంట ప్రత్యేక విమానంలో ఔరంగాబాద్‌‌‌‌కు వెళ్లారు. బహిరంగ సభ వేదిక మీద కూర్చున్నారు. తన ప్రసంగంలో కేసీఆర్.. సోమేశ్‌‌‌‌ను ఆకాశానికెత్తారు. తెలంగాణ మోడల్ రూపొందించడంలో సోమేశ్ ఎంతో తోడ్పాటు అందించారని తెలిపారు. అంతకుముందు బహిరంగ సభ వేదికపై ఛత్రపతి శివాజీ మహరాజ్, మహాత్మా బసవేశ్వరుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అన్నాబావ్ సాటే, అహల్యాబాయి హోల్కర్, మహాత్మా జ్యోతిబాఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి కేసీఆర్ నివాళులర్పించారు. ‘మహారాష్ట్ర పుణ్యభూమికి నా ప్రణామాలు’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. ‘జై మహారాష్ట్ర.. జై భారత్’ నినాదంతో ముగించారు. మరాఠా రచయిత ప్రదీప్ సాలుంకే రచించిన తెలంగాణ - మాఝా అనుభవ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు స్థానిక నాయకుడు అభయ్ పాటిల్ నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి జంబిదా మైదానం చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీలు కేకే, బీబీ పాటిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


మనం పులుల్లా మారాల్సిందే

ఢిల్లీలో రైతులు 13 నెలలు ఎందుకు ధర్నా, ఆందోళన చేయాల్సి వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించా రు. ఈ ఆందోళనల్లో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా పట్టింపులేనట్టుగా పాలకు లు వ్యవహరించారని మండిపడ్డారు. చివరికి ప్రధాని క్షమాపణ కోరి, రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. రైతులకు దక్కాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ‘‘దేశంలో పరివర్తన, మార్పు తేవాల్సిన అవసరం ఉంది. మార్పు అంటే ఒక పార్టీ గెలవడం.. ఇంకోటి ఓడిపోవడం కాదు. ప్రజలు గెలవాలె. దేశంలో రోజూ వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో ఎందరో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోనోళ్లు.. ఆఫ్రికా నుంచి చీతాలు తెచ్చామని చూపిస్తున్నారు” అని మండిపడ్డారు. ‘‘మనం పులులు అయ్యేంత వరకు మన సమస్యలకు పరిష్కారం దొరకదు. మనం పులుల్లా మారాల్సిందే. మనలో పరివర్తన రాకుండా దేశంలో పరివర్తన సాధ్యం కాదు. పరివర్తన కోసమే పుట్టింది బీఆర్ఎస్.. ప్రతి ఒక్కరి కోసం ఏర్పాటు చేసింది. భయపడి ఉంటే ఇప్పటికీ మనకు స్వాతంత్ర్యం వచ్చేది కాదు..మన పోరాటంలో నిజాయితీ ఉంది. విజయం సాధించడం తథ్యం. మనకు దేవుళ్ల ఆశీస్సులు కూడా ఉంటాయి” అని చెప్పారు.


తెలంగాణ అధ్వానంగా ఉండె

విభజనకు ముందు తెలంగాణలో మహారాష్ట్ర కన్నా అధ్వాన పరిస్థితులు ఉండేవని కేసీఆర్ తెలిపారు. ‘‘కరెంట్​ఉండేది కాదు. మధ్యాహ్నం 3 గంటలే కరెంట్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు మేం 24 గంటలూ రైతులకు ఉచితంగా ఇస్తున్నాం. తెలంగాణలోనే 24 గంటల కరెంట్​ఇవ్వగలిగినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బొగ్గు నిల్వలు దేశంలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడున్న నిల్వలతో 150 ఏళ్ల పాటు దేశం మొత్తానికి 24 గంటల కరెంట్ ఇవ్వొచ్చు. నేను చెప్పేది అబద్ధమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్త. ఎవడబ్బ జాగీరని కరెంట్‌‌‌‌ను ప్రైవేటీకరిస్తున్నారు? దేశంలో బీఆర్ఎస్​అధికారంలోకి రాగానే.. ప్రైవేటీకరించిన అన్ని సంస్థలను తిరిగి ప్రభుత్వపరం చేస్తం” అని హామీ ఇచ్చారు.


రైతులు ఎమ్మెల్యేలు కావాలె

నాగలి పట్టే రైతులు ఎమ్మెల్యేలై అసెంబ్లీకి ఎందుకు పోవద్దు. చిన్న రాష్ట్రమైన తెలంగాణలోనే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నప్పుడు పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేస్తలేరు. ఔరంగాబాద్​లో నీకేం పని అని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ నన్ను ప్రశ్నిస్తున్నడు. తెలంగాణ మోడల్‌‌ను మక్కీకి మక్కీ అమలు చేస్తే.. నేను మహారాష్ట్రకు రాకుంaడా మధ్యప్రదేశ్‌‌కు పోత. ఫడ్నవీస్.. మహారాష్ట్రలో రైతుబంధు ఇవ్వు. అంబేద్కర్ పుట్టిన ఈ రాష్ట్రంలోని దళితులకు అండగా నిలిచేందుకు దళితబంధు ఇవ్వు. అప్పుడు నేను ఇక్కడకు రావడం మానేస్త. మేకిన్ ఇండియా అంటరు..  మరి ఈ ఔరంగాబాద్​లో ఎన్ని చైనా బజార్లున్నయ్​? మేకిన్ ఇండియా నిజమైతే భారత్ బజార్లు ఉండాలి కదా? అవేవీ? మేకిన్ ఇండియా జోక్​ఇన్ ఇండియా అయింది.        - సీఎం కేసీఆర్​