ఏ పని పెండింగులో ఉండటానికి వీల్లేదు

ఏ పని పెండింగులో ఉండటానికి వీల్లేదు

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. జులై 1 నుంచి అమలు చేయనున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా.. ఏడో విడత హరితహారం కార్యక్రమంలో అందుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించారు. నిర్దేశించిన ఏ పనీ పెండింగులో ఉండటానికి వీల్లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఇంతగా సహకరిస్తున్నా కూడా పనులు ఇంకా ఎందుకు పెండింగులో ఉంటున్నాయో.. అధికారులు పున: సమీక్ష చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున డోర్ టు డోర్ పంపిణీ చేసి.. నాటించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పంటలు పండుతూ  దేశ ధాన్యాగారంగా మారిందన్నారు. రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణ అవసరమని.. రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలన్నారు.

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టి..ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్.ఇ.జెడ్ (సెజ్) లను 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలన్నారు సీఎం కేసీఆర్. సెజ్ ల చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేసి, ఆ పరిధిలో లే ఔట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదన్నారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలని.. వ్యవసాయశాఖ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో కల్తీ విత్తనాల అమ్మకాలను అరికట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించడానికి పవర్ డే ను పాటించాలన్నారు సీఎం కేసీఆర్.ప్రజలను చైతన్య పరిచి, శ్రమదానంలో పాల్గొనేలా చేసి.. కరెంటు సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.