హుజూరాబాద్ వెళ్లండి.. దళిత వాడల్లో తిరగండి

హుజూరాబాద్ వెళ్లండి.. దళిత వాడల్లో తిరగండి
  • అధికారులకు సీఎం కేసీఆర్‌‌ ఆదేశం
  • వారికి ఆర్థిక స్థిరత్వాన్నిచ్చే స్కీమ్‌లు రూపొందించాలి
  • దళిత సంఘాల నేతలతో వర్క్ షాప్ పెట్టండి
  • అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దళితులకు త్వరగా ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే పనులను గుర్తించి వాటికనుగుణంగా పథకాలు రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్‌‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌‌లో దళితబంధు పథకంపై ఆయన రివ్యూ నిర్వహించారు. పైలట్‌‌ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి దళిత కుటుంబాల స్థితిగతులు అర్థం చేసుకోవాలన్నారు. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుగా ఒక అవగాహనకు రావాలన్నారు. ఉపాధి కలిగించే వినూత్న పథకాల కోసం ఎవరెవరిని కలవాలి? వారి నుంచి ఎలాంటి సమాచారం తీసుకోవాలి? దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న వారి సలహాలు, సూచనలు ఈ పథకంలో ఎలా అమలు చేయాలనే అంశాలపై అధికారులు ముందుగా సెన్సిటైజ్‌‌ కావాలన్నారు. ఇందుకోసం దళిత ప్రముఖులు, సంఘాల నేతలు, ఉన్నతాధికారులతో వర్క్‌‌షాప్‌‌ నిర్వహిస్తామన్నారు. వర్క్‌‌షాప్‌‌లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పైలట్‌‌ ప్రాజెక్టు చేపడుతున్న హుజూరాబాద్‌‌లోని దళిత వాడలకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించగానే ఆదాయం సృష్టించే విధంగా పథకాల రూపకల్పన ఉండాలన్నారు. దళితబంధు పథకం ద్వారా ఎలాంటి పని చేసుకోగలరని దళితుల నుంచి సమాచారం తీసుకోవాలన్నారు. బర్రెల పెంపకం, కిరాణాషాపు, ఆటోరిక్షాలు, కుటీర పరిశ్రమలు తదితర ఉపాధి అవకాశాలను గుర్తించి, వాటిని మార్కెట్‌‌ చేయడానికి ప్రభుత్వం సహకరించాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన పథకాల జాబితాతో పాటు ఆయా ప్రాంతాల్లో ఇతర ఉపాధి మార్గాలు ఏమైనా ఉన్నాయా, వారికిష్టమైన ఇతర పనులు ఉన్నాయా అని తెలుసుకోవాలన్నారు. దళితులు కోరుకున్న పథకాలు కాకుండా మూసపద్ధతి స్కీంలను వారికి అంటగట్టవద్దని సూచించారు.