దళిత బంధు రాష్ట్రమంతటా అమలు చేస్తం.. 

దళిత బంధు రాష్ట్రమంతటా అమలు చేస్తం.. 
  • వచ్చే బడ్జెట్‌‌లో రూ.20 వేల కోట్లు పెడ్తం: సీఎం
  • ఎస్సీ కార్పొరేషన్‌‌ లోన్లతో ఎవ్వరూ బాగుపడలే 
  • రేపు కేంద్రంలో మనం శాసించే ప్రభుత్వం రావొచ్చు
  • ఇప్పుడున్న ప్రభుత్వమే మనపై దయచూపొచ్చు
  • దరఖాస్తులు పెడుతం.. దండం పెట్టి అడుగుతం
  • అప్పుడింకా ఎక్కువ మందికి దళిత బంధు వర్తింపజేస్తం
  •  దసరా తర్వాత ‘పోడు’ అప్లికేషన్లు తీసుకుంటం
  •  బీసీ జనాభా లెక్కల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతం

హైదరాబాద్‌‌, వెలుగు : హుజూరాబాద్​ బై ఎలక్షన్​ కోసమే దళిత బంధు తీసుకురాలేదని, ఆ స్కీంను రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో హుజూరాబాద్‌‌ నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికి నాలుగు దిక్కులా నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో స్కీం అమలు చేస్తామన్నారు. అదేవిధంగా వంద నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వంద కుటుంబాలకు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే స్కీంను వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే మార్చిలోపు  రూ. 3 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామన్నారు. దళిత బంధు పథకం అమలుపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన షార్ట్‌‌ డిస్కషన్‌‌కు కేసీఆర్​ సమాధానమిచ్చారు. గంటన్నరకు పైగా ఆయన మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్‌‌ లోన్లతో బాగుపడ్డ వాళ్లు ఎవ్వరూ లేరన్నారు. అందుకే అన్ని పార్టీలు,  మేధావులతో  చర్చించి దళిత బంధుకు రూపకల్పన చేశామని అన్నారు.‘‘హుజూరాబాద్‌‌ కోసమో.. ఆ బాదు కోసమో.. ఈ బాదు కోసమే దళితబంధు తేలే.. బడ్జెట్‌‌లోనే దళిత్‌‌ ఎంపవర్‌‌మెంట్‌‌కు రూ.వెయ్యి కోట్లు పెట్టినం.. అవసరమైతే రివైజ్డ్‌‌ ఎస్టిమేట్లలో కేటాయింపులు పెంచుకుంటం.. ఈ స్కీం గురించి ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్న.. ఒక నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఫలితాలు ఎట్లుంటయో తెలుస్తయనే హుజూరాబాద్‌‌ను ఎంచుకున్నం’’ అని చెప్పారు. వచ్చే ఏడాది బడ్జెట్‌‌లో దళిత బంధుకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. 


దళిత బంధు స్కీం అమలు చేస్తున్న మిగతా నాలుగు మండలాలకు వారంలోనే  డబ్బులు వేస్తామని సీఎం చెప్పారు.తాను స్వయంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. దళిత బంధు స్కీం కింద ఇచ్చే రూ. 9.90 లక్షలతో ఒక్కటి కాకపోతే రెండు, మూడు వ్యాపారాలైన పెట్టుకోవచ్చని సీఎం వివరించారు. ప్రతి లబ్ధిదారుడికి చిప్‌‌ ఇస్తామని, దాని ద్వారా మానిటర్​ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల లైసెన్సుల్లో దళితులకు రిజర్వేషన్‌‌ ఇస్తున్నామని, కొత్తగా వచ్చే వైన్‌‌షాపుల్లో 250 నుంచి 300 వైన్స్‌‌ వాళ్లకు దక్కుతాయన్నారు. దళితబంధు లబ్ధిదారులకు మిగతా ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని పేర్కొన్నారు. ఉద్యోగం ఉన్న దళితులకు కూడా దళిత బంధు వర్తింపజేస్తామని, వారిని చివరి వరుసలో స్కీం తీసుకోమని సూచించామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో ఎవరికి దళిత బంధు ఇవ్వాలనేది సంబంధిత ఎమ్మెల్యే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17.53 శాతం ఎస్సీ జనాభా ఉందని, దీనికి తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచాల్సిన అసవరం ఉందన్నారు. 
కేంద్రంలో మనం శాసించే ప్రభుత్వం రావొచ్చు
‘‘దళిత బంధు లబ్ధిదారులు కేసీఆర్‌‌ బొమ్మ పెట్టుకోవాలని ఏమీలేదు. వారికి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు” అని సీఎం కేసీఆర్​పేర్కొన్నారు. తమకు ఓటేసినా, వేయకున్నా దళితబంధు ఇచ్చి తీరుతామన్నారు. ‘‘రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. రేపు కేంద్రంలో మనం శాసించే ప్రభుత్వమే రావొచ్చు.. కేంద్రంలో మనకు చోటు దక్కొచ్చు.. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికే మనపై దయ కలుగవచ్చు.. ప్రధానికి మూరెడు కాకుంటే బారెడు దరఖాస్తులు ఇస్తం.. దండం పెడుతం.. ఎందుకు అడుగం.. రేపు రాజకీయంగా కలిసి వచ్చి కేంద్రం సహకరిస్తే ఒక్క ఏడాదిలోనే 5 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేస్తం..’’ అని ఆయన అన్నారు. ‘‘దళితుల దుఃఖం అమెరికా వాళ్లు వచ్చి తుడవరు.. మనమే తుడవాలి.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం మంచి చేస్తున్నది.. రేపు మిగతా పేదలకు కూడా న్యాయం జరుగుతది..’’ అని చెప్పారు. డాక్టర్‌‌ బీఆర్‌‌ అంబేద్కర్‌‌ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,  రాజ్యాంగ నిర్మాణంలో ఆయన ఉజ్వల పాత్ర పోషించారని, రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌‌కే ఉండాలని గట్టిగా వాదించారని సీఎం పేర్కొన్నారు. 
దసరా తర్వాత పోడు అప్లికేషన్లు తీసుకుంటం
పోడు సాగు చేసుకుంటున్న ఎస్టీల నుంచి దసరా తర్వాత అప్లికేషన్లు తీసుకుని, వారికి హక్కులు కల్పించే ప్రయత్నాలు మొదలు పెడతామని సీఎం వెల్లడించారు. అర్హులైన గిరిజనులకు మొదటి దశలో హక్కులు కల్పించి, గిరిజనేతరులకు హక్కులు కల్పించే విషయాన్ని కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే వారికి ఏ గతి పడుతుందో అందరూ చూస్తున్నారని ఆయన హెచ్చరించారు. 
దళిత బంధుకు చట్టంపై దాటవేత
దళిత బంధు చట్టం తీసుకురావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌‌ ఒవైసీ కోరినా సీఎం కేసీఆర్​ స్పందించలేదు. ఎస్సీ సబ్‌‌ ప్లాన్‌‌కే చట్టబద్ధత ఉన్నదని దాటవేశారు. ముస్లింలలోని పేదలు సహా ఇతర కులాల్లోని పేదలకు ఇప్పటికే ఎంతో కొంత చేశామని, భవిష్యత్‌‌లోనూ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు బంధుతో రైతుల ఆదాయం పెరిగిందని చెప్పారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌‌రెడ్డి ఊరిలో రైతులకు పంట డబ్బులతో పాటు రైతు బంధు సొమ్ము కలిపితే రూ. 6 కోట్లు వచ్చాయని, నల్గొండ జిల్లాలో ఎకరం భూమి అమ్మి  ప్రకాశం జిల్లాలో ఆరు ఎకరాలు కొన్నారని సీఎం తెలిపారు. భూములు అమ్మితే ఒక్క స్ట్రోక్​లో రూ. 2,700 కోట్లు వచ్చిన కరోనాతో రాష్ట్రం లక్ష కోట్ల ఆదాయం కోల్పోయిందని, మళ్లీ కోలుకొని ముందుకు సాగుతున్నామని, ఇప్పుడు 11.5 శాతం గ్రోత్‌‌ రేట్‌‌ ఉందని సీఎం తెలిపారు. భూములు వేలానికి పెడితే ఒక్క స్ట్రోక్‌‌లో రూ.2,700 కోట్లు వచ్చాయని, ఆ సొమ్మును దళితుల బాగు కోసం ఖర్చు చేస్తామన్నారు. తాను సిద్దిపేటలో ‘‘ఫ్రెండ్‌‌షిప్‌‌ బ్యాంక్‌‌’’ ఏర్పాటు చేస్తే అందులో 800 మంది వరకు సభ్యులుగా చేరారన్నారు. జేజే రమేశ్‌‌ అనే కౌన్సిలర్‌‌ కిడ్నీలు ఫెయిల్‌‌ అయితే అందరం కలిసి ఐదున్నర లక్షలు కలెక్ట్‌‌ చేసి ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంట్‌‌ చేయించామని సీఎం తెలిపారు. అప్పటి అనుభవంతోనే  దళిత రక్షణ నిధి ఏర్పాటు చేశామన్నారు.

గొప్పగొప్పోళ్లు వర్గీకరణ చేయించుకరండ్రి
‘‘ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధాని దగ్గరికి డెలిగేషన్​ను తీసుకుపోవాలని అంటున్నరు.. మీరు గొప్పగొప్పోళ్లు ఉన్నరు కదా.. ప్రధాని దగ్గరికిపోయి ఒప్పించి వర్గీకరణ చేయించుకురండ్రి.. బేగంపేటల్నో.. శంషాబాద్‌‌లనో మేం పెద్ద పెద్ద పూలదండలు వేసి వెల్‌‌కం చెప్తం.. రఘునందన్‌‌ రావు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్న.. యువ సభ్యులు సభకు రావాలే..’’ అని సీఎం కేసీఆర్​ అన్నారు. నవోదయ చట్టం ప్రకారం జిల్లాకు ఒక నవోదయ విద్యాసంస్థ ఇప్పించేలా రఘునందన్‌‌ ప్రధానిని ఒప్పించాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రఘునందన్‌‌  జవాబిస్తూ.. సీఎం కోరినట్టుగానే ప్రధానిని ఒప్పించి జిల్లాకు ఒక నవోదయ విద్యాసంస్థ తీసుకువస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీయలేమని  సుప్రీంకోర్టులో అఫిడవిట్‌‌ సమర్పించిందని, ఇది సరైన విధానం కాదని, బీసీ జనాభా లెక్కింపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం వెల్లడించారు.