3 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులిచ్చాం

3 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులిచ్చాం

హైదరాబాద్ : రాష్ట్రం లో ప్రస్తుతం  కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతుుందన్నారు సీఎం కేసీఆర్. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం ప్రజలనుద్దేశించిం మాట్లాడారు. ఇప్పటికే కొత్తగా  మూడు లక్షలపై చిలుకు రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 2019 డిసెంబరు నుంచి కరోనా కల్పించిన , కల్పిస్తున్న కష్ట నష్టాలు అన్నీఇన్నీ కావు. వాటిని అధిగమిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ,  ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం  శతవిధాలా కృషి చేసింది. వ్యాధికంటే, వ్యాధి భయంతో చాలామంది మరణిస్తున్నారని తెలిసి,  నేనే స్వయంగా హైదరాబాద్, వరంగల్ ఆస్పత్రులను సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న కరోనా రోగులను పలకరించి, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాను.  వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాను. ప్రస్తుతం మన రాష్ట్రం లో ప్రభుత్వ కోవిడ్ వైద్య కేంద్రాలలో 27,996 బెడ్లు అందుబాటులో ఉండగా అందులో 17,114 బెడ్లను ఆక్సీజన్ బెడ్లుగా ప్రభుత్వం  అభివృద్ధి చేసింది. త్వరలోనే అన్నిబెడ్లను ఆక్సీజన్ బెడ్లుగా మార్చబోతున్నది. కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంలో మన డాక్టర్లు, వైద్య శాఖ  సిబ్బంది చేసిన కృషి అభినందనీయం. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆస్పత్రులలో వసతి సౌకర్యాలు మెరుగు పరిచింది. డయాలసిస్ వంటి వైద్యసేవలు, అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చింది. ఇప్పుడు అధునాతన వసతులతో కొత్త ఆస్పత్రుల నిర్మాణం, పడకల పెంపునకు శ్రీకారం చుట్టింది. అన్ని జిల్లా కేంద్రాలలో డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఈ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. ఈ కేంద్రాలలో 50కి పైగా పరీక్షలు ఉచితంగా  నిర్వహిస్తారు. బస్తీల్లో నివసించే పేద ప్రజల ముంగిటికి వైద్యాన్ని తీసుకురావాలనే సదుద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం నగరంలో 224 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది.

పేదలు నివసించే బస్తీలలో ఉండే ఈ వైద్యశాలల్లో వైద్యంతో పాటు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తోంది. అవసరమైన మందులు కూడా అందిస్తున్నది. తమ నివాసాల దగ్గరే దవాఖానలను ఏర్పాటు కావడంతో నగరంలోని పేద ప్రజలు చీటికిమాటికి కార్పోరేట్ హాస్పటళ్ళను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే దుస్థితి తొలగిపోయింది. బస్తీ దవాఖానలు తమకు ఒక వరంగా మారయని పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్తీ దవాఖానాలిచ్చిన స్ఫూర్తితో టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో “పల్లె దవాఖానాలు” ఏర్పాటు చేస్తున్నది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ గ్రామీణ ఉప వైద్య కేంద్రాలలో కేవలం నర్సులు మాత్రమె అందుబాటులో ఉండేవారు.   డాక్టర్లను కూడా  అందుబాటులోకి తేవాలని తెలంగాణా ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున డాక్టర్ల నియామక  ప్రక్రియను చేపట్టింది. మహిళల ప్రసూతి విషయంలో ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వ్యవహరించింది. దేశంలోనే తొలి సారిగా మెటర్నటీ ఐ.సి.యులను  ఏర్పాటు చేసింది.  చాలాచోట్ల మహిళల ప్రసూతి కోసమే ప్రత్యేక వైద్య శాలలు నెలకొల్పింది. 102 అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి మారుమూల పల్లెల నుంచి కూడా ప్రసవం  కోసం గర్భిణీస్త్రీలను దవాఖానాలకు తరలించే ఏర్పాటు చేసింది.  కె.సి.ఆర్ కిట్స్ ప్రారంభించి ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవిస్తే 12 వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నది. 2 వేల రూపాయల విలువైన వస్తువులతో హెల్త్ కిట్ పంపిణీ చేస్తున్నది.  ఈ చర్యలతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల  సంఖ్య గణనీయంగా పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివిధ సూచీలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నవజాత శిశు మరణాలు, బాలింత మరణాలు, ఐదేళ్ళలోపు శిశువుల మరణాలు అరికట్టడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణా రాష్ట్ర పౌరుల డిజిటల్ ఆరోగ్య నివేదిక (HEALTH PROFILE) రూపొందించే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ములుగు సిరిసిల్ల, నియోజకవర్గాలలో వివరాల సేకరణను ప్రారంభించింది    

నూతనంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళ నిర్మాణం  
అరవై ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణాలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం ఐదు మాత్రమే.  తెలంగాణా  రాష్ట్రం ఏర్పడిన మొదటి దశలోనే  టి ఆర్ ఎస్ ప్రభుత్వం నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్ నగర్ లలో 4 కొత్త కళాశాలలను వెనువెంటనే మంజూరు చేసింది. ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది. ప్రస్తుతం కొత్తగా మరో 8 వైద్య కళాశాలలు ప్రభుత్వం. మంజూరు చేసింది. ఇవి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నది. వేగంగా భవనాల నిర్మాణం చేపడుతోంది.  నూతనంగా మంజూరైన వైద్యకళాశాలలతో కలిపి రాష్ట్రంలో వైద్య కళాశాల సంఖ్య 17 కు చేరుకుంది. రాబోయే రోజుల్లో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు లక్ష్యంగా  ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. నగరం నలుదిక్కులా వైద్య సేవల విస్తరణ కోసం“తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్” (“టిమ్స్”) అనే  పేరుతొ  మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని గచ్చిబౌలిలో మొట్టమొదటి టిమ్స్ దవాఖాన ఏర్పాటయి సేవలందిస్తోంది. ఎల్.బి.నగర్, అల్వాల్, సనత్ నగర్ లలో మరో మూడు టిమ్స్ మల్టీ స్పెషాలిటి హాస్పిటళ్ళను  ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం భూసేకరణ పనులు పూర్తయ్యాయి. సింగరేణి ప్రాంతంలోని రామగుండంలో ఒకటి      పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో ఒకటి   మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రభుత్వం నిర్మించనున్నది. త్వరలో ఈ హాస్పిటళ్ళ నిర్మాణ పనులకు ప్రభుత్వం శంకుస్థాపన చేయబోతున్నది. వరంగల్ నగరంలో అధునాతమైన వసతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇటీవల నా చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది.  అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఒకే గొడుగు కింద అందుబాటులోకి వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు.