ధరణిలో ఉన్న భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు

ధరణిలో ఉన్న భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు

హైదరాబాద్: రేపటి నుంచే రాష్ట్రంలోని ఆరు లక్షల  మంది అన్నదాతల కు 50 వేల రూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్.  75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం ప్రజలనుద్దేశించిం మాట్లాడారు.  మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తు  లవుతున్నారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది.  రైతులు పండించిన పంటలకు మరింత గిట్టుబాటు ధర లభించి, రైతులకు అదనపు మేలు చేకూరాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల పరిధిలో రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీటిద్వారా రైతులు కష్టించి పండించిన వ్యవసాయోత్పత్తులకు మరింత మంచి ధర లభించి, రైతాంగం జీవనం సుసంపన్నం కావాలన్నదే టిఆర్ ఎస్ ప్రభుత్వ ఆశయం. తెలంగాణా ప్రభుత్వం  రైతుల ప్రభుత్వం.  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకున్న మూల కారణాలను అన్నిటినీ గ్రహించి పరిష్కార చర్యలు చేపట్టింది.  తరాలతరబడి అనేక భూ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మార్చడానికి నూతన భూపరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రగతి నిరోధకంగా మారిన వి.ఆర్.వో ల వ్యవస్థను తొలగించింది, మూడేళ్ళు కష్టపడి ధరణి పోర్టల్ ను ఆవిష్కరించి,  భూరికార్డుల నిర్వహణలో పారదర్శకతను తెచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. అన్నదాతలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. ధరణిలో నమోదయిన భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని తెలిపారు సీఎం కేసీఆర్. 

తెలంగాణా రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది.  రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లు కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే తెలంగాణా ప్రభుత్వం 2016 రూపాయలిచ్చి నిజమైన చేయూతనిస్తున్నది.  సంక్షేమ ఫలాలు మరింత విస్తృత సంఖ్యలో ప్రజలకు అందించటం కోసం వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హత వయస్సును 65 నుంచి  57 ఏళ్ళకు తగ్గించింది. దీనివల్ల మరింతమంది నిస్సహాయులకి ఆసరా అందుతుంది. గతంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మాత్రమే పరిమితమైన ఆసరా పింఛను పథకాన్ని బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, బోదకాలు బాధితులకు కూడా తెలంగాణా ప్రభుత్వం వర్తింపచేస్తున్నది.పేదింటి ఆడబిడ్డల పెండ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి కల్యాణలక్షి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 51 వేల రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పుడు లక్షా నూటపదహార్లు అందుతున్నాయి . ఇవన్నీ ఎన్నికల్లో వాగ్దానం చేసినవి కావు. పేదల కష్టనష్టాలను తెలిసిన ప్రభుత్వంగా  మానవతా భావనతో అమలుచేస్తున్న పథకాలివి. నేతన్నలకు బీమా    తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడానికి అనేక పథకాలు రూపకల్పన చేసింది. చేనేత కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తున్నది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, రంగులు అందజేస్తుంది  చేనేత కార్మికుల  కుటుంబాలను మరింత ఆదుకోవడానికి   రాష్ట్రంలో  రైతన్నలకు అమలుచేస్తున్న రైతుబీమా తరహాలో త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా మరణిస్తే ఈ పథకం కింద  అతని కుటుంబం ఖాతాలో ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము జమవుతుంది. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి టిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేయనుందని సీఎం కేసీఆర్ తెలిపారు.