అన్ని రంగాల్లో గుణాత్మక మార్పు వచ్చింది

అన్ని రంగాల్లో గుణాత్మక మార్పు వచ్చింది

హైదరాబాద్: స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సీఎం కేసీఆర్..తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాంతంత్య్ర సమర యోధులకు వందనమన్న కేసీఆర్.. అహింసా మార్గంలో తెలంగాణ సాధించామన్నారు. అన్ని రంగాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని..విద్యుత్,తాగు,సాగు నీటి సమస్యలు దూరం చేశామని తెలిపారు. పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నామని..కరోనా ఇబ్బందులున్నా అధిగమించామన్నారు.

తలసరి ఆదాయంలో దేశం కంటే ముందున్నామన్న సీఎం..రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 12 వేల 126 రూపాయలు  ఉండగా నేడు తెలంగాణా రాష్ట్ర  తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 632 రూపాయలకు చేరుకుందన్నారు. నేడు  మన దేశ తలసరి ఆదాయం 1 లక్షా 28 వేల 829 రూపాయలు గా నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలున్నపెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి గర్విస్తున్నాను.  కరెంట్ కష్టాలను అదిగమించి, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. వ్యవసాయరంగంలో రైతుల కష్టాలను తీర్చామని..కోటి 6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామన్నారు. గత ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 శాతం మన రాష్ట్రమే అందించ గలిగింది.  రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తోందన్నారు సీఎం కేసీఆర్.