
- బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రమన్నదే వాళ్ల విధానం
- ప్రజల మధ్య మత చిచ్చుపెట్టి విద్వేషాలు రేపుతున్నది
- సీట్లు, ఓట్లే రాజకీయం కాదు.. అట్ల చేస్తే అది అరాచకమైతది
- ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తం
- మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం పెంచుతం
- కృష్ణా, గోదావరి బోర్డుల పెత్తనం నడువనీయమన్న సీఎం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రం అన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని విమర్శించారు. ‘‘ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం. అనారోగ్యకరమైన, అప్రజాస్వామిక చర్య. ఇది భవిష్యత్‌లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈ పెడధోరణి మంచిది కాదు’’ అని అన్నారు. దేశం రాష్ట్రాల సమాఖ్య అని, ‘రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తం.. అణచిపెడ్తం’ లాంటి అనేక దుర్మార్గమైన చర్యలను కేంద్రం చేస్తోందన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రేపుతోందని, ఇది ఎంతమాత్రమూ మంచిదికాదన్నారు. దేశంలో మత పిచ్చి పెంచుతున్నరని.. ఆ కార్చిచ్చు దేశాన్ని దహించి వేస్తదని, ఇది సరికాదని హితవుపలికారు. అప్రాప్రియేషన్ బిల్లుపై మంగళవారం అసెంబ్లీలో చేపట్టిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. జీవో 111ను ఎత్తేస్తామని, ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ స్టూడెంట్లను ప్రభుత్వమే చదివిస్తుందని తెలిపారు. మన నీళ్లపై కేంద్రం పెత్తనం సహించబోమని స్పష్టం చేశారు.
పెట్టుబడులు ఎట్లొస్తయ్?
ప్రపంచంలోని ఏ కంపెనీ అయినా ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెట్టేందుకు అనువైన ఇకో సిస్టమ్‌ను రూపొందించామని కేసీఆర్ తెలిపారు. రేపు మన దగ్గర ఘర్షణలు జరిగితే ఎవరైనా పెట్టుబడులు పెడుతారా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రంలోని పాలకులు మతకలహాలు, ఇతర గొడవలు పెట్టి.. ప్రజలను విడదీసి, ఒకర్నొకరు తన్నుకునేలా చేస్తే ఏం కావాలె? బెంగళూరులో విమానం దిగితే కర్ఫ్యూ ఉంటదట.. హిజాబ్ పంచాయితీ ఉంటదట.. అది ఆహార్యం.. ఒకరు ప్యాంట్ వేసుకుంటరు.. ఒకరు ధోతికట్టుకుంటరు.. ఒకాయన షేర్వానీ ఏసుకుంటరు.. దానితోని గవర్నమెంట్‌కు ఏం సంబంధం? అది ఒక అంశంలా చిత్రీకరించి.. సంకుచితంగా వ్యవహారాలు చేస్తే దేశం ఎక్కడికిపోతది? హైదరాబాద్‌లో వాతావరణం బాగుంటదంటే పెట్టుబడులు వస్తయి కానీ ఎయిర్‌పోర్టుల దిగంగానే కత్తులతో పొడుసుకుంటరట.. కర్ఫ్యూ ఉంటదట అంటే ఎవడొస్తడు?’’ అని ప్రశ్నించారు.
డేంజర్‌లో ఫెడరలిజం
రోడ్లు, అభివృద్ధి పనుల కోసం 5 హెక్టార్ల అటవీ భూమిని సేకరించే అధికారం నిన్నమొన్నటి దాకా రాష్ట్రాలకే ఉండేదని, దాన్ని కేంద్రం ఒక హెక్టార్‌కు తగ్గించిందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడం కాదా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దీన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రాల శాసనసభలు ఏకకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీరుతో ఫెడరిలిజం డేంజర్‌లో పడిపోయిందన్నారు. ‘‘రాష్ట్రాల్లో పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఎప్పుడుపడితే అప్పుడు వాపస్ తీసుకుంటం.. మీ గొంతుకోస్తం అని కేంద్రం అంటోంది. ఇది దుర్మార్గమైన చర్య. వారిని చెప్పుచేతల్లో పెట్టుకునే ఆలోచన విరమించుకోవాలని కేంద్రానికి చాలా బలంగా చెప్పాం’’ అని తెలిపారు.
బావులకు మీటర్లు చచ్చినా పెట్టనన్న
‘‘వ్యవసాయ బావులకు మీటర్లను నేను చచ్చినా పెట్టనన్న.. రూ.25 వేల కోట్లు నష్టపోవడానికి సిద్ధమైనం” అని కేసీఆర్ చెప్పారు. దేశంలో ఫాస్టెస్ట్ వెల్త్ మేకర్‌గా తెలంగాణ రూపుదిద్దుకుందని కేంద్రం గణాంకాలు చెప్తున్నాయన్నారు. తాము చేపట్టిన చర్యల ఫలితంగా మతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 33 కాలేజీలకు పోతున్నామని తెలిపారు. దేశంలో అతి తక్కువ వయస్సున్న తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన విజయాలు సాధిస్తున్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్’లో వెల్లడించిందన్నారు. దేశానికి పెద్దగా వ్యవహరించే కేంద్రం పాలసీ విచిత్రమైన ధోరణుల్లో ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సింగిల్ ‘ఇంజన్’తోనే దూసుకుపోతున్నం
డబుల్ ఇంజన్ గ్రోత్ అంటూ కొందరు కొత్త నినాదం మొదలు పెట్టారని, కానీ అది ట్రబుల్ ఇంజన్ గ్రోత్ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. యూపీ తలసరి ఆదాయం రూ.71 వేలు అయితే మనది రూ.2.87 లక్షలు అని తెలిపారు. డబుల్ ఇంజన్ యూపీ వెనుకబడిపోతే.. సింగిల్ ఇంజన్ ఉన్న తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. 2014లో ఉన్న యూపీఏ సర్కారుపై నానా రకాల నిందలు మోపి.. ఇప్పుడున్న పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత ‘అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది’ అన్నట్టుగా ప్రజల పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో గ్రోత్ 8 శాతం ఉంటే, ఇప్పుడు 6 శాతానికి పడిపోయిందన్నారు. కేంద్రం విధానాలతోనే దేశం దివాళా తీసిందన్నారు.
రాజకీయం కాదు అరాచకం
బడ్జెట్ అనేది పబ్లిక్ ఫండ్ అని కేసీఆర్ తెలిపారు. ఓట్లు.. సీట్లు లెక్కపెట్టుకోవడమే రాజకీయం కాదని.. అంతకే పరిమితమైతే అది అరాచకమైతదని చెప్పారు. ఈ మధ్య దురదృష్టవశాత్తు చాలామంది పిగ్మీలు (మరగుజ్జులు) ఇందులో దూరిపోయి, అవగాహన లేమితో.. అసహజమైన పెడధోరణులతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీంతో భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచానికే మార్గదర్శిగా ఉన్న దేశం గొప్పతనం దెబ్బతింటుందని చెప్పారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చిన్నప్పుడు స్కూల్ ఎక్స్‌కర్షన్‌కు వస్తే మూడు గంటలకు ఒక ఫ్లైట్ వచ్చిందని, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రోజుకు 589 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. ఎయిర్‌ట్రాఫిక్‌లో కోల్‌కతా, చెన్నైని దాటి హైదరాబాద్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందన్నారు.
ఏటా 2 లక్షల మందికి దళితబంధు
ఏటా 2 లక్షల మందికి దళితబంధు ఇస్తామని సీఎం తెలిపారు. మార్చి చివరికల్లా 40 వేల మందికి ఈ స్కీం ద్వారా లబ్ధి చేకూరుస్తామన్నారు. తర్వాత గిరిజనులు, ఇతర పేదలకు ఈ తరహా పథకం వర్తింపజేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, జర్నలిస్టుల ఇంటి స్థలాల పంపిణీ వివాదం సుప్రీంకోర్టులో త్వరలో సమసిపోతుందని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా బోర్డులు ఏకపక్షంగా మన ప్రాజెక్టులు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిఘటించామన్నారు. కృష్ణా నీళ్లలో చుక్క వాటా కోల్పోవడానికి కూడా సిద్ధంగా లేమన్నారు. గోదావరిలో మిగులు జలాలపై తెలంగాణ, ఏపీకే హక్కు ఉంటుందని, మన సమ్మతి లేకుండా గోదావరి – కావేరి లింక్ చేస్తామంటే అడ్డుకుని తీరుతామన్నారు. అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు.
ఉక్రెయిన్ విద్యార్థుల చదువుల ఖర్చులు భరిస్తం
రాష్ట్రం నుంచి 740 మందికి పైగా స్టూడెంట్లు ఉక్రెయిన్‌కు వెళ్తే అందులో 700 మంది దాకా ఎంబీబీఎస్ చదవడానికే వెళ్లారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక్కడ దిక్కు, అవకాశం లేదు కాబట్టే అక్కడికి వెళ్లారని చెప్పారు. ‘‘710 మంది పిల్లలను టికెట్లు భరించి ఇక్కడికి తీసుకువచ్చాం. వాళ్లు తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లలేరు కాబట్టి.. వాళ్ల చదవులకు ఎంత ఖర్చయినా భరించి.. డిస్కంటిన్యూ కాకుండా కొనసాగిస్తాం. దీనిపై కేంద్రానికి వెంటనే లేఖ రాస్తాం” అని వెల్లడించారు. బెంగళూరుకు చెందిన నవీన్ అనే విద్యార్థి అక్కడ చనిపోతే తిన్నదరగక పోయిండ్రని కేంద్ర మంత్రి ఎట్లా అంటారని ప్రశ్నించారు. దీనిపై తాము మాట్లాడితే దేశ ద్రోహులు అంటున్నరన్నారు.
భట్టి.. ఎంపీ కావాలె
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంపీ కావాలని సీఎం ఆకాంక్షించారు. ఆయన కేంద్రంపై ఘాటుగా మాట్లాడారని, అవే మాటలు పార్లమెంట్‌లో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ‘మన ఊరు – మన బడి’ బాగుందని భట్టి అన్నారని, ఇన్నాళ్లకు ఆయన ప్రేమకు తాము నోచుకున్నామని తెలిపారు. రైతులు ఒక్క దరికి రావాలనే వాటర్ సెస్సు, కరెంట్ బిల్లులు రద్దు చేశామని, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు పెడితే తప్ప ఎకరం భూమి దొరకడం లేదన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ మధ్యే సీడబ్ల్యూసీ క్లియరెన్స్ వచ్చిందన్నారు. నీళ్లు కింద ఉండి.. మన భూములు మీద ఉన్నయి కాబట్టే లిఫ్ట్ చేయాల్సిందేనని చెప్పారు. కల్తీ విత్తనాలపై పీడీ యాక్ట్ పెట్టిన ఒకేఒక్క రాష్ట్రం మనదేనని తెలిపారు.