రేపు గజ్వేల్‌లో కేసీఆర్ పర్యటన

రేపు గజ్వేల్‌లో కేసీఆర్ పర్యటన

సిద్దిపేట: సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీష్ రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వర్గల్ మండలం హౌసులపల్లి గ్రామంలో ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ కాలువలోకి గోదావరి జలాలను కేసీఆర్ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఉదయం 11.15 గంటలకు మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువ లోకి గోదావరి జలాల విడుదల చేస్తారు. హల్దీ కాలువలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారని, మరో 8 నుంచి 10 రోజుల్లో హల్దీ, మంజీర నుండి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. హల్దీ, మంజీరా నుండి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాల విడుదల చేయడం వల్ల 32 చెక్ డ్యామ్‌లు నిండుతాయని, ఈ చెక్ డ్యాంలలో 0.62 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. ఈ వేసవిలో గోదావరి జలాల విడుదల వల్ల 14 వేల 268 ఎకరాల వరి పంటను కాపాడుకోగలుగుతామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతుల పంటలను కాపాడాలన్న ఉద్దేశంతో నీటి విడుదల చేయిస్తున్నామని.. ప్రజలు, రైతుల సమక్షంలో వేడుకగా జరుపుకోవాల్సిన ఈ ఘట్టాన్ని సాదాసీదాగా జరుపుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.