స్పీకర్, సీఎం తీరు నిరంకుశత్వానికి నిదర్శనం

స్పీకర్, సీఎం తీరు నిరంకుశత్వానికి నిదర్శనం
  • బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్, రాజాసింగ్
  • స్పీకర్, సీఎం తీరు నిరంకుశత్వానికి నిదర్శనం 
  • సస్పెన్షన్ కు నిరసనగా 17న ఇందిరాపార్క్ వద్ద దీక్ష
  • స్పీకర్​ కుర్చీని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని ఫైర్​​
  • ఉద్యమాన్ని తూలనాడిన వారితో సస్పెండ్ చేయించి అవమానపరిచారు: ఈటల


హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ నుంచి తమ సస్పెన్షన్​విషయంలో స్పీకర్ చైర్ కు విలువ ఇస్తూ హైకోర్టు చేసిన సూచనను లెక్కచేయకపోవడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్​రావు, రాజాసింగ్ అన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ విధానాలపై మండిపడ్డారు. తమ సస్పెన్షన్​కు నిరసనగా ఈ నెల 17 న ఇందిరా పార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తామని ప్రకటించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందన్నారు. మంగళవారం అసెంబ్లీ నుంచి వెనుదిరిగి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

నార్త్​కొరియా గుర్తుకొస్తున్నది: ఈటల

అసెంబ్లీలో తమ సీటు నుంచి ఒక్క అడుగు కూడ కదలలేదని, ఎలాంటి ఆందోళన చేయలేదని ఈటల అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం మంగళవారం అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ ముందు తమ వాదన వినిపించామన్నారు. మా విషయంలో స్పీకర్, సీఎం వ్యవహరించిన తీరు నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కొత్త సంప్రదాయానికి తెరలేపారని మండిపడ్డారు. ‘‘నేను ఒక ఉద్యమకారుడిని, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిన వారి చేత మమ్మల్ని సస్పెండ్ చేయించడం అవమానపరిచింది. నేను 25 ఏండ్లుగా ఈ సభలో అనేక మంది స్పీకర్లను, సీఎంలను చూశాను.. కానీ ఇంత దుర్మార్గంగా ఎవరు వ్యవహరించలేదు. 2008 నుంచి 2014 వరకు శాసనసభ పక్ష నేతగా ఉండి గౌరవం తెచ్చిన వాడిని, కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మా సస్పెన్షన్​పై సభ అభిప్రాయం మళ్లీ తెలుసుకొమ్మని కోర్టు కోరినా.. స్పందించలేదు” అని ఈటల అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ తీరు చూస్తే నార్త్ కొరియా గుర్తుకు వస్తుందన్నారు. అక్కడ అధ్యక్షుడు మాట్లాడుతున్న సందర్భంలో చప్పట్లు కొట్టలేదని ఒక సభ్యున్ని కాల్చి చంపారన్నారు. రానున్న రోజుల్లో సీఎం మాట్లాడితే చప్పట్లు కొట్టలేదని కూడా సస్పెండ్ చేస్తారేమో అని అన్నారు. ‘‘కేసీఆర్ అప్రజాస్వామిక పనులకు ప్రజా క్షేత్రంలోనే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆయన అహంకారాన్ని బొందపెట్టే రోజు త్వరలోనే వస్తుంది” అని ధ్వజమెత్తారు.

మమ్మల్ని శాసించలేరు: రఘునందన్

అసెంబ్లీలో బీజేపీ తరఫున మేము ముగ్గురమే కావచ్చని.. కానీ మంద బలంతో టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని శాసించలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. కేసీఆర్​ను చూసి ప్రజలు నవ్వుకునే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ‘‘స్పీకర్ కుర్చీని కేసీఆర్ రాజకీయాలకు వాడుకోవటం దుర్మార్గం. శాసనసభలో జరుగుతున్న అవమానాలకు.. భవిష్యత్ వాటిని అనుభవించేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉండాలి. హైకోర్టు ఉత్తర్వులను స్పీకర్ తిరస్కరించటం చీకటి రోజు. కేసీఆర్ ఆదేశాల మేరకే స్పీకర్ ఇలా వ్యవహరిస్తున్నారు. మా సీట్లలో మేము కూర్చుంటే ఎలా సస్పెండ్ చేస్తారు” అని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై మా వాదనలతో స్పీకర్ ఏకీభవించలేదన్నారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. ‘‘హైకోర్టు ఉత్తర్వులను, మా అభ్యర్థనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత.. మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నా” అని స్పీకర్ చెప్పడం తమకు బాధ కలిగించిందన్నారు. కేసీఆర్ డైరెక్షన్ మేరకే స్పీకర్ పని చేస్తున్నారని ఆరోపించారు.

స్పీకర్ మాటల్లో భయం కనిపించింది: రాజాసింగ్

స్పీకర్ మాతో మాట్లాడిన సందర్భంలో ఆయనలో ఒక రకమైన భయం కనిపించిందని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. స్పీకర్ ను సీఎం కేసీఆర్ ఎంత టార్చర్ పెడుతున్నారో అర్థమవుతుందన్నారు. పోడియం వద్దకు రాని.‌. ఈటల, రఘనందన్ రావులను సస్పెండ్ చేయటం అన్యాయమన్నారు.