ప్రధానికి పెద్ద లిస్టు : యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం

ప్రధానికి పెద్ద లిస్టు : యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం
  • నరేంద్ర మోడీతో భేటీ అయిన సీఎం కేసీఆర్​
  • యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం
  • మెగా టెక్స్​టైల్​ పార్క్​కు రూ. వెయ్యి కోట్లు
  • నక్సల్ ఏరియాల్లో రోడ్లకు ఫండ్స్​
  • హైదరాబాద్​‑–నాగ్​పూర్ ఇండస్ట్రియల్​ కారిడార్ 
  • ఐపీఎస్ క్యాడర్  పెంపు జిల్లాకో నవోదయ విద్యాలయం
  • గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు
  • హైదరాబాద్​కు ఐఐఎం.. కరీంనగర్​కు ట్రిపుల్​ ఐటీ
  • వరంగల్​కు  ట్రైబల్​ వర్సిటీ.. ఢిల్లీలో తెలంగాణ భవన్​ నిర్మాణానికి జాగ


న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రమే మొత్తం ఫండ్స్​ సమకూర్చాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్​ కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని, వీటిని జిల్లాకొకటి మంజూరు చేయాలని, హైదరాబాద్​లో ఐఐఎం, కరీంనగర్​లో ట్రిపుల్​ ఐటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కావాల్సిన జాగను తాము అందిస్తామని చెప్పారు.  రాష్ట్రంలో ఐపీఎస్ క్యాడర్ ను 139 నుంచి 195 కు పెంచాలని, హైదరాబాద్ -– నాగ్ పూర్ ఇండస్ట్రియల్​ కారిడార్ ఏర్పాటుకు సహకరించాలని విన్నవించారు. వరంగల్  టెక్స్ టైల్  పార్క్ కోసం రూ. వెయ్యి కోట్ల ను గ్రాంట్ ఇన్  ఎయిడ్ కింద అందించాలన్నారు. ఢిల్లీలో రాష్ట్ర అధికారిక భవనం ‘తెలంగాణ భవన్​’ కోసం స్థలం కేటాయించాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధాని అధికారిక నివాసంలో  దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. కీలకంగా పది అంశాలను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారని, ఇందుకు సంబంధించి వినతిపత్రాలు అందజేశారని సీఎంవో తెలిపింది. 

  • ప్రధానికి సీఎం విజ్ఞాపనలు

నవోదయ విద్యాలయాలు: కేంద్ర పాలసీ ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల ఆంకాక్ష, పాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 9  నవోదయ విద్యాలయాలు ఉన్నాయని,  కొత్త  జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని కోరారు.
టెక్స్​టైల్ పార్క్: వరంగల్  టెక్స్ టైల్  పార్క్ కోసం రూ. వెయ్యి కోట్ల ను గ్రాంట్ ఇన్  ఎయిడ్ కింద అందించాలని ప్రధానిని సీఎం కోరారు. దేశంలో కాటన్ ఉత్పత్తి చేసే సెకండ్ లార్జెస్ట్  స్టేట్ గా తెలంగాణ ఉందని, ఏడాదిలో దాదాపు 60 లక్షల బేళ్ల లాంగ్ స్టేపుల్  కాటన్ ఉత్పత్తి ఉంటుందని తెలిపారు. దేశంలో టెక్స్ టైల్ రంగాన్ని కేంద్రం అభివృద్ధి చేయాలని యోచిస్తున్నందున వరంగల్ లోని 2 వేల ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు రూ. 1, 600 కోట్లు అవసరమని చెప్పారు. వన్ టైం గ్రాంట్ ఇన్  ఎయిడ్ కింద రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు. 
ట్రైబల్ యూనివర్సిటీ: విభజన చట్టం కింద రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీకి సహకరించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. వరంగల్ లో ఎన్ఐటీ ఉన్నందున, పీపీపీ మోడల్ లో కరీంనగర్​లో ట్రిపుల్ ఐటీ స్థాపించడానికి సహకరించాలని ప్రధాని మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత అకడమిక్ సెషన్ నుంచే అడ్మిషన్లు ప్రారంభించడానికి సహకరించాలని కోరారు.
నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు: నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రోడ్ల పనులకు సీఎస్ఎస్  ఫార్మాట్ లో 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయని, కేంద్రమే మొత్తం నిధులివ్వాలని కోరారు.

హైదరాబాద్ – నాగ్ పూర్ ఇండస్ట్రియల్​ కారిడార్: హైదరాబాద్ – నాగ్ పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి సీఎం విన్నవించారు. ఢిల్లీ – ముంబై ఇండస్ట్రియల్ కారిడార్​ లో 585 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ ఉందని వివరించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ – హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ ను అభివృద్ధి చేయడానికి ఆసక్తిగా ఉందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఇన్వెస్ట్‌‌మెంట్ రీజియన్ల ఏర్పాటు కోసం ఢిల్లీ- – ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ తరహాలో హైదరాబాద్-–  నాగ్‌‌పూర్, వరంగల్-– హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లను ప్రోత్సహించాలని అభ్యర్థించారు.   
.
ఐపీఎస్​ల సంఖ్యను పెంచండి: జిల్లాల విభజన కారణంగా రాష్ట్రంలో ఐపీఎస్ ల క్యాడర్ ను సమీక్షించాలని ప్రధానిని కేసీఆర్​ కోరారు. 2016 లో కేంద్ర హోంశాఖ చేసిన క్యాడర్ రివ్యూలో 76 డ్యూటీ పోస్ట్ లు, 139 అధీకృత పోస్టులను తెలంగాణకు ఆమోదించారని చెప్పారు. అయితే, ప్రస్తుతం జిల్లాల పెంపు కారణంగా డ్యూటీ పోస్ట్ లను 76 నుంచి 105 కు, ఐపీఎస్ క్యాడర్ ను 139 నుంచి 195 కు పెంచాలని ఆయన కోరారు.

పీఎంజీఎస్​వై: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్ వై ) కింద రోడ్లను మెరుగుపరచాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద దాదాపు 4 వేల కిలో మీటర్ల రోడ్లు తెలంగాణకు మంజూరు చేయవచ్చన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ కోసం గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. 

ఢిల్లీలో స్థలం ఇవ్వండి: ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అధికారిక భవనం ‘తెలంగాణ భవన్’  నిర్మించుకునేందుకు భూమిని కేటాయించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా అధికారిక భవనాలు ఉన్నట్లే తెలంగాణకు కూడా భవన నిర్మాణం కోసం అనువైన చోట స్థలం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ప్రధాని సానుకూలంగా స్పందించి, జాగా కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సీఎంవో తెలిపింది. 

హైదరాబాద్​లో ఐఐఎం: ప్రతి రాష్ట్రంలో ఒక్కో ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) స్థాపిస్తామని కేంద్ర ప్రభుత్వం పాలసీలో పేర్కొందని, హైదరాబాద్​లో ఏర్పాటు చేయాలని ప్రధానిని సీఎం కోరారు. హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్ బి) ఉన్నందున  ఐఐఎం మంజూరు కాలేదని, ఐఎస్​బీ ఒక ప్రైవేటు లాభాపేక్షలేని స్వీయ – ఫైనాన్సింగ్ సంస్థ అయినందున, విపరీతమైన ట్యూషన్ ఫీజులతో సాధారణ విద్యార్థులకు ఇందులో చదువుకునే స్థోమత ఉండదన్నారు. హెచ్​సీయూలో 2 వేల ఎకరాలకుపైగా భూమి ఉందని, అవసరమైతే ఆ భూమి ఇస్తామని ప్రధానికి తెలిపారు.