
జోగులాంబ గద్వాల : ముఖ్యమంత్రి కేసీఆర్కు మతి తప్పిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్లో బీజేపీ గెలుపును సీఎం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నడిగడ్డలో కొత్తగా ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చినవా అని ఈటల ప్రశ్నించారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. వరి కొనమన్నందుకు నీళ్లున్నా 20లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదని వాపోయారు. రాష్ట్రంలో రైతుల కన్నీళ్లకు కేసీఆర్ సర్కారు భస్మీపటలం అవడం ఖాయమని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పతన ఖాయమన్న ఈటల.. అందుకు కేటీఆర్ మాటలే సజీవ సాక్ష్యమని చెప్పారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.