రేవంత్ అబద్ధాల వరద పారించిండు : హరీశ్

రేవంత్ అబద్ధాల వరద పారించిండు : హరీశ్
  • అసెంబ్లీలో బూతులు మాట్లాడిన సీఎం క్షమాపణ చెప్పాలి: హరీశ్  

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో సీఎం రేవంత్ అసభ్యకరమైన భాషలో అబద్ధాల వరద పారించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ‘‘ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ వేదికగా ‘భడివె’ లాంటి పరమ బూతు పదాన్ని ప్రయోగించిన రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. నాలుక కోస్తానంటూ హింసాత్మకమైన, నేర ప్రవృత్తితో అసెంబ్లీలో మాట్లాడటం ఆయన రాజకీయ నీచత్వానికి పరాకాష్ట’’ అని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం ప్రసంగంపై శనివా రం హరీశ్ స్పందించారు.

సీఎం రేవంత్ బూతులు మాట్లాడుతున్నా స్పీకర్ వారించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. “బీఆర్ఎస్ చేసిన న్యాయపోరాటం ఫలితంగానే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌‌పై ఎన్జీటీ స్టే ఇచ్చింది. కానీ అది తన ఘనకార్యంగా రేవంత్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్సే తెచ్చిందనడం రేవంత్ పిచ్చిప్రేలాపన తప్ప మరొకటి కాదు. పాలమూరు ప్రాజెక్టు కోసం 2009 ఎన్నికల సమయంలో సీఎంవో నోట్ ఇస్తే, 2014 ఎన్నికల సమయంలో డీపీఆర్ కోసం జీవో జారీ చేసిన చరిత్ర నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిది. డీపీఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికే ఐదేండ్లు చేసిన మీరా.. మా గురించి అవాకులు చెవాకులు పేలేది” అని విమర్శించారు. 

బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే తీర్మానాలు..  

పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు తగ్గించిన మాట నిజమేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదని హరీశ్​ అన్నారు. నాడు నల్గొండలో కేసీఆర్ గర్జిస్తే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించమంటూ తీర్మానం చేశారని,  నేడు బీఆర్ఎస్ నిలదీస్తేనే పోలవరం–నల్లమల్లసాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేశారని.. ఈ తీర్మానాలు బీఆర్ఎస్ పోరాట ఫలితాలేనని హరీశ్​ అన్నారు.